అగ్నిపథ్ ఏకపక్ష నిర్ణయం కాదు.. అనేక దేశాల విధానాలను పరిశీలించాకే నిర్ణయం తీసుకున్నాం
ఇతర దేశాల విధానాలను పరిశీలించిన కేంద్రం.. రాష్ర్టాలతో ఎందుకు చర్చించలేదు?
అభ్యంతరాలుంటే రా్రష్ట్ర ప్రభుత్వాలు, మేధావులతో చర్చకు సిద్ధం.
ఆ పని ముందే ఎందుకు చేయలేదు. ఒకవైపు చర్చిద్దామని అంటూనే మరోవైపు అగ్నిపథ్‌ను సమర్థిస్తూ త్వరలోనే నియమకాలు ఉంటాయని రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ చేసిన ప్రకటనలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు రైతులు ఆందోళనకు దిగితే వారితో చర్చలు జరిపారా?
ప్రజల్లో దేశభక్తి, జాతీయ భావం పెంచే ప్రయత్నంలో భాగమే అగ్నిపథ్.
దేశరక్షణ వంటి గురుతరమైన బాధ్యతలను నిర్వహించడానికి ముందుకు వచ్చే వారికి పెన్షన్, ఉద్యోగ భద్రత లేకుండా చేయడం, ఇదా వారికి ఇచ్చే గౌరవం?
శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ర్టాలదే
మరి ఈ సూత్రం ఢిల్లీకి వర్తించదా? సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా కేంద్ర బలగాలను ఎందుకు బరిలోకి దింపారు?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో రాజకీయ ప్రమేయం ఉంది.
రాజ్‌భవన్ వేదికగా జరుగుతున్న రాజకీయాల వెనుక కూడా రాజకీయ ప్రమేయం ఉందని అంగీకరిస్తున్నట్టేనా?
సికింద్రాబాద్ ఘటనలో టీఆర్ఎస్ ప్రభుత్వ హస్తం ఉంది
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్‌తో పాటు బీహార్‌లో జరిగిన ఆందోళనల వెనుక ఎవరి హస్తం ఉన్నట్టు?
ఆర్మీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల ముసుగులో కొందరు సికింద్రాబాద్ స్టేషన్‌పై దాడి చేసారు.
జరిగిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపిస్తామని చెబుతూనే కొందరు దాడి చేశారని ఏవిధంగా నిర్ధారిస్తారు?
సికింద్రాబాద్ ఘటన టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు చేసిన కుట్ర
మరి ఈ కుట్రను కేంద్రం ఎందుకు పసిగట్టలేకపోయింది. ఒక రాష్ట్రంలో జరిగిన ఘటననే పసిగట్టలేని కేంద్రం దేశానికి ఏ విధమైన రక్షణ కల్పించగలదు?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడికి ఒక పథకం ప్రకారం ముందుగానే ప్లాన్ జరిగింది. ఆందోళనకారులు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకున్నారు
సోషల్ మీడియాపై నిఘా పెట్టి చైనా యాప్‌లను నిషేధించినట్టు గొప్పగా చెప్పుకున్న కేంద్రం ఈ వాట్పాప్ గ్రూపులను ఎందుకు కనిపెట్టలేకపోయింది?
అగ్నిపథ్ పేరుతో ఆర్మీ అభ్యర్థులకు అన్యాయం చేసే ఆలోచన లేదు
ఆ ఆలోచన లేకపోతే సైనికులకు ముందు నుంచి కల్పించిన పెన్షన్‌కు, ఉద్యోగ భద్రతకు ఎందుకు ఎసరు పెట్టారు?
యువతలో దేశభక్తి, జాతీయ భావం పెంచడానికే కేంద్రం అగ్నిపథ్ తెచ్చింది
దేశభక్తి, జాతీయ భావం కలిగి ఉండటమే పెన్షన్ పొందడానికి అనర్హతనా? దేశ రక్షణకు ముందుకు వచ్చే వారికి లేని పెన్షన్ రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, చట్టసభల ప్రతినిధులకు ఎందుకు?
కేంద్రం, రాష్ట్రం ఎవరి ఆస్తి అయినా అది ప్రజల సొమ్మే
అలాంటప్పుడు ఆ స్కీమ్ కేంద్రానిది.. ఈ నిధులు కేంద్రానివని అడ్డంగా వాదించే బీజేపీ నేతలకు ఆ సోయి ఎందుకు లేదు? కేంద్రం ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా అంతా ప్రజల సొమ్మేనని ఇన్నాళ్లకు తెలిసి వచ్చిందా?
సికింద్రాబాద్ ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తాం
ఈ ఘటనతో ఆర్మీ అభ్యర్థులకు సంబంధం లేదని, దాడి వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని విచారణ జరుగకుండానే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చాక ఇక విచారణ ఎందుకు?