Danam Nagender | ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ట్వీట్లు చేస్తున్నారని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌పై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్న వేళ.. దానం నాగేందర్ ఆమెకు మద్దతుగా నిలిచారు. స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్‌లో తప్పేమీ లేదని ఆయన స్పష్టం చేశారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితినే ఆమె రీట్వీట్ చేశారని పేర్కొన్నారు. అంతేగానీ ఆమె చేసిన పనిలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏమీ లేదని వివరించారు.
హైదరాబాద్‌లోని నారాయణగూడ కమ్యూనిటీ హాలులో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. కంచ గచ్చిబౌలి విషయంలో సీఎస్ శాంతికుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం బాధించిందని తెలిపారు. ఆమెకు మంచి అధికారిగా పేరు ఉందని, కోర్టు చివాట్లతో చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కూడా దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను ప్రజలు చూడాలని ఆశపడుతున్నారని.. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని అభిప్రాయపడ్డారు.
అసలేం జరిగింది?
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ చేసిన గిబ్లీ ఫొటోను స్మితా సబర్వాల్ రీపోస్ట్ చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫొటో అంటూ అభియోగాలు మోపారు. ఈ మేరకు బీఎన్ఎస్ 179 సెక్షన్ కింద స్మితా సబర్వాల్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ విచారణకు కూడా హాజరయ్యారు. ఆ విషయాన్ని మళ్లీ ట్విట్టర్ (ఎక్స్) హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టును రీషేర్ చేయడానికి సంబంధించిన వివరణను రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్మితాసబర్వాల్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. చట్టం పరిధిలో పోలీసులకు పూర్తిగా సహకరించినట్టు పేర్కొన్నారు. చట్టానికి కట్టుబడే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులను కొన్ని ప్రశ్నలు అడిగినట్టు చెప్పారు. ఆ పోస్టును 2 వేల మంది రీషేర్ చేశారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా? అనే స్పష్టత కోరాను. అలా కాకపోతే ఎంపిక చేసిన కొంతమందినే లక్ష్యంగా చేసుకున్నట్టు అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అలా జరిగినట్టయితే చట్టం ముందు అందరూ సమానమే అనే సహజన్యాయ సూత్రానికి రాజీపడినట్టే అవుతుంది కదా అని పేర్కొన్నారు. తన ట్వీట్లో #RuleofLaw #Freedo mOfSpeech #justsaying అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు ఇచ్చారు. ఆ తర్వాత కూడా కంచ గచ్చిబౌలి విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్ నాయకులు స్మితా సబర్వాల్‌పై మండిపడుతున్నారు.
అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు : గజ్జెల కాంతం
ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడుతారని కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం ప్రశ్నించారు. ఆమె ఏం యాక్షన్ చేస్తుందబ్బా.. ఆమె ఐఏఎస్ అధికారిణి అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. 13 ఏళ్లలో 13 లక్షల చెట్లను నరికివేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. అప్పుడు సోషల్‌మీడియా పోస్టులు ఎందుకు పెట్టలేదని అన్నారు
అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుందా : ప్రొఫెసర్ నాగేశ్వర్
స్మితా సబర్వాల్ బీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. ఐఏఎస్‌గా ఉండి ప్రభుత్వాన్ని నిందించే పోస్టులు పెట్టే బదులు.. రాజకీయాల్లో చేరితో సరిపోతుంది కదా అని అన్నారు. హెచ్‌సీయూ భూములపై ఆమె మాట్లాడింది ఓకే.. కానీ పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఏనాడైనా ప్రశ్నించిందా అని అడిగారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల గురించి ఆమె మాట్లాడారా? కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చెట్లను నరికేస్తే నోరు విప్పిందా అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో మౌనంగా ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇబ్బందికరంగా పోస్టులు పెడితే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుందా అని ప్రశ్నించారు.