హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ) : అవును.. తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసి, స్వరాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి, తెలంగాణ సాధించి కేసీఆర్ తప్పు చేశారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సాధన కోసం ఆయన చేయని తప్పులు లేవని కాంగ్రెస్‌కు కౌంటర్ వేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘ఎక్కిన మెట్టు, దిగిన మెట్టు లేదన్నట్టు తెలంగాణ కోసం కాళ్లరిగేలా తిరిగి కేసీఆర్ తప్పు చేశారు. దేశంలోని అన్ని పార్టీలకు తెలంగాణ ఆవశ్యకతను చెప్పి, వారిని మెప్పించి తప్పు చేశారు. తెలంగాణ కోసం పోరుబాట పట్టి, వరంగల్ సభ, సకలజనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం నిర్వహించి, ప్రాణత్యాగానికి సిద్ధపడి తప్పు చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణను సాధించడమే కేసీఆర్ చేసిన అతిపెద్ద తప్పు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపి, తలసరి ఆదాయాన్ని రూ.3.56 లక్షలకు పెంచి, జీఎస్డీపీని రూ.15 లక్షల కోట్లకు పెంచి, రూ.1 లక్ష కోట్ల బడ్జెట్‌ను రూ.2.7 లక్షల కోట్లకు పెంచి తప్పు చేశారు. కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, రుణమాఫీ, 24 గంటల కరెంటు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబంధు, రైతుబీమా, గురుకులాలు, టీహబ్, టీవర్క్స్, కాళేశ్వరం, సీతారామ, దేవాదుల నిర్మాణం, బస్తీ దవాఖానలు, కేసీఆర్ కిట్, కంటి వెలుగు తదితర పథకాలు, హరితహారం లాంటి కార్యక్రమాలు చేపట్టడమే కేసీఆర్ చేసిన తప్పు. చేతకాని వారి చేతుల్లో పాలన పెట్టి.. రోజూ తిట్టించుకోవడమే ఆయన చేసిన అసలుసిసలు తప్పు’ అని కాంగ్రెస్‌పై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని దూషిస్తూ.. ఆయనపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నట్టు మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. కేసీఆర్‌ను దూషించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఆయన కోరారు. సీఎంగా ఉన్న సమయంలో సాగునీరు, తాగునీరు అందించడంతోపాటు 24గంటల విద్యుత్తు అందించిన కేసీఆర్‌ను దూషిస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. సబ్బండవర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడాన్ని శశిధర్‌రెడ్డి తప్పుబట్టారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి కేసీఆర్‌కు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు.