హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు అవసరమైన ప్రత్యామ్నాయ ఎజెండారూపకర్త అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. కేసీఆర్ ఆదివారం నిర్వహించిన 2 గంటల 22 నిమిషాల సుదీర్ఘ ప్రెస్మీట్ ఆలోచనాపరులందరికీ ఒక ఆశ, ధైర్యాన్ని కలిగించిందని చెప్పారు. దేశ ప్రజలందరితో ఒక ప్రత్యామ్నాయ ఎజెండా కోసం ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టు అనిపించిందన్నారు. ప్రజల్లో వేల ఆలోచనలు విరబూయటానికి కావాల్సిన వందల ప్రశ్నలు సంధించారని అన్నారు. మతవిద్వేషాలకు యాంటీ డోస్ ఇచ్చినట్టు, ఈ కాలం సామాజిక ప్రవక్తగా మాట్లాడారని పేర్కొన్నారు. కేసీఆర్ ఒక దార్శనిక ఆలోచనల తాత్వికుడిగా, బాధ్యత కలిగిన భారతమాత ముద్దుబిడ్డగా, ఒక సామాజిక విప్లవకారునిగా మాట్లాడారని పేర్కొన్నారు. ఆయన ఆలోచనధారల నుంచి ప్రత్నామ్నాయ ప్రజల వేదికపుట్టి సస్యశ్యామల దేశంగా భారతావని ఆవిష్కారమవుతున్న నమ్మకం కలుగుతుందని చెప్పారు. ప్రత్నామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వారికి బహిరంగ ముసాయిదాను, రేపటి భవిష్యత్తుకు మ్యానిఫెస్టో అందించారని అన్నారు. కేసీఆర్ ఆలోచనలు ప్రజల ఎజెండాగా నిలిచి గెలవాలని ఆకాంక్షించారు.