KCR | హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ధర్మం, సత్యం, త్యాగానికి ప్రతీక మొహర్రం అని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. మత సామరస్యాన్ని చాటుతూ పల్లె నుంచి పట్నం దాకా సాగే పీర్ల పండుగ గంగా-జమున తెహజీబ్‌కు అద్దంపడుతుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హసన్, హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ ముస్లింలు జరుపుకొనే వేడుకలో తెలంగాణ ప్రజలు కులమతాలకు అతీతంగా పాల్గొంటారని గుర్తుచేశారు.
అన్ని వర్గాల పండుగల స్ఫూర్తితో బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేసిందని గుర్తుచేశారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిందని వివరించారు. ఇదే స్ఫూర్తి భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. మైనారిటీల సంక్షేమానికి బీఆర్ఎస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు.