రాంనగర్/ కరీంనగర్ (నమస్తేతెలంగాణ) అక్టోబర్ 13: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆధారాలు లేకుండా తరలిస్తున్న సుమారు రూ.46 లక్షల నగదును శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న పవన్ కల్యాణ్ వద్ద రూ.16.69 లక్షలు పట్టుకున్నామని డీసీపీ రాజు, ఏసీపీ నరేందర్ తెలిపారు. గాజుల శ్రీనివాస్ వద్ద రూ.2.90 లక్షలు, అబ్దుల్ జబ్బర్‌ఖాన్ వద్ద రూ.6 లక్షల చొప్పున స్వాధీనం చేసుకొని రిటర్నింగ్ అధికారికి అప్పగించినట్టు వారు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు చౌరస్తా వద్ద లక్కారం గ్రామానికి చెందిన గుర్రం మధుకర్‌రెడ్డి వద్ద రూ.2,53,460 నగదును అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్‌లో నిరంజన్ వద్ద రూ.15.30 లక్షల నగదును పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం శివారులోని పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద చొప్పదండి మండలం మంగళపల్లికి చెందిన వెలమ సౌజన్య వద్ద రూ.4.50 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. ఆధారాలు చూపకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఓ వాహనంలో తరలిస్తున్న రూ.15 వేల విలువైన 83 చీరలను పోలీసులు పట్టుకున్నారు.