హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, ఈ నెల 11న ఆయన జయంతిలోగా విగ్రహ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మంగళవారం బీసీ దీక్ష చేపట్టారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (టీపీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ఈ దీక్షా శిబిరానికి వేలాది మంది బీసీలు, ప్రజలు తరలివచ్చారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన ఈ శిబిరంలోబీసీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. బీసీల కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితకు బీసీలకు చెందిన ఆటోవాలాలు, హమాలీ కార్మికులతోపాటు న్యాయవాదులు, డాక్టర్లు, వృత్తిదారుల సంఘాల నేతలు సంఘీభావంగా పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ దీక్షను ఉద్దేశించి కవిత మాట్లాడారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని, అనుముల ఇంటెలిజెన్స్ అని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఈ అనుముల ఇంటెలిజెన్స్‌తోనే రాష్ర్టానికి ప్రమాదం ఉన్నదని, ఇప్పటికే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నని, అనుముల ఇంటెలిజెన్స్ పకకు జరిగితే తప్పా రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బీసీల స్థితి ఏమిటో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయా? లేదా? రాష్ట్రపతికి పంపారా? అని నిలదీశారు. ఈ బిల్లుల విషయంలో అవసరమైతే ఢిల్లీలో నిరవదికగా దీక్షలకు కూర్చుందామని పిలుపునిచ్చారు. దేశంలో ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల అమలుతో 50 శాతం రిజర్వేషన్ పరిమితి తొలగిందని, 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించినా కోర్టులు అడ్డుకోలేవని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలంటే ప్రజా ఉద్యమాలే మార్గమని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్‌లో దళిత నేత, ప్రతిపక్ష నేత టికారాం జుల్లి శ్రీరామనవమి రోజు రాముడి గుడికి వెళ్తే, ఆ గుడి మైల పడిందని సంప్రోక్షణ చేశారని, అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి దేశంలో ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకే కాదు బీసీలకు కూడా సమాజంలో అనేక సందర్భాల్లో ఇప్పటికీ అవమానాలు జరుగుతున్నాయని, ఇవి సమాజానికి మంచిది కాదని, వీటిని రూపుమాపడానికి నడుంబిగించాలని కవిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆట, పాటలతోపాటు దీక్షా ప్రాంగణ పరిసరాలు మార్మోగాయి. అనంతరం ముఠా అయాన అనే 8 ఏండ్ల చిన్నారి అందించిన నిమ్మరసం సేవించిన ఎమ్మెల్సీ కవిత దీక్ష విరమించారు. కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రాంచందర్‌రావు , కో కన్వీనర్ బొల్ల శివశంకర్, ఆలకుంటల హరి, టీజీపీఎస్సీ మాజీ సభ్యుడు సుమిత్ర తనోబా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జైసింహ, నివేదిత సాయన్న, ఆశిష్యాదవ్, తెలంగాణ జాగృతి నాయకులు నవీన్ ఆచారి, శ్రీధర్‌రావు, ప్రశాంత్ అనంతుల, మారేపల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.