Sirikonda Prashanth | కాజీపేట : శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి కుమారుడు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సిరికొండ ప్రశాంత్‌పై కేసు నమోదైంది. బిఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలతో కలిసి వెళ్ళే క్రమంలో ఉప్పల్ రైల్వే గేట్ వద్ద చేపట్టిన ఆందోళనకు గాను కాజీపేట రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
బిఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27 వ తేదీన ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ భారీ బహిరంగ సభకు జనం లక్షలాదిగా తరలిన నేపథ్యంలో జన ప్రవాహాన్ని గమనించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సభకు జనాలు చేరుకోకుండా అనేక ఆటంకాలు సృష్టించారు. అందులో భాగంగా భూపాలపల్లి నుండి సభకు వెళ్ళే వాహనాలను ఉప్పల్ మీదుగా మళ్ళించి రైల్వే గేట్ వద్ద ఉద్దేశ పూర్వకంగా దాదాపు రెండు గంటలకు పైగా రైలు నిలిపివేసారు. దీంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. భూపాలపల్లి నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులతో ఉప్పల్ మీదుగా సభకు బయలుదేరిన సిరికొండ ప్రశాంత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రైల్వే గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఇది గమనించిన రైల్వే అధికారులు రైలుకు సిగ్నల్ ఇచ్చి తరలించారు. ఆందోళన చేపట్టినందుకు గాను రైల్వే పోలీసులు సిరికొండ ప్రశాంత్‌తో పాటు 14 మంది బిఆర్ఎస్ నాయకులపై కేసు నమోదు చేశారు.