ఒక గీత గీసి… అది పెద్దదా? చిన్నదా?? అని చెప్పమంటే కష్టం. అదే దాని పక్కన మరో గీత గీస్తే… మొదటి గీత గొప్పతనమేందో సమగ్రంగా అర్థమవుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఘనత కూడా అంతే. మేం సాగరాలు నిర్మించామని తాజా పాలకులు తాతల కథలు చెప్తున్నారు. కానీ అవి ఎప్పుడు కాగితాల మీదకొచ్చాయి… ఎప్పుడు భూమిపూజకు నోచుకున్నాయి… మరెప్పుడు పూర్తయి తెలంగాణ రైతన్న గోస తీర్చాయి.తరాలు మారినా తెలంగాణ బీడు భూముల తలరాత మారలేదు కదా!
మరి ఆ ఘనకార్యాన్ని ఎందుకో చెప్పుకోరు!! అవన్నీ ప్రజలకు తెల్వదు… మేం చెప్పేదే నమ్ముతారనుకొని ఇష్టానుసారంగా మాట్లాడతారు. వాస్తవాల్ని వాళ్లు చెప్పకపోవచ్చు… కానీ తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి ఏ ఒక్క చిన్న ప్రాజెక్టును పట్టుకున్నా దశాబ్దాల గోసను ఒక కథలా వినిపిస్తుంది. ఆ ప్రాజెక్టుల గోడును… తెలంగాణ రైతాంగ గోసను విన్నందునే ‘తెలంగాణ సాగునీటి రంగమంటే రాసుకుంటే రామాయణమంత, చెప్పుకుంటే భాగవతమంత’ అని ఒక్క వాక్యంలో ఈ నేల ఆర్థ్రతను విప్పారు. అందుకే కేసీఆర్ తెలంగాణకు పట్టిన ఆ గతిని మార్చారు. కాళేశ్వరంతో కొత్త చరిత్రను సృష్టించారు.
అన్నం ఉడికిందనేందుకు ఒక మెతుకు పట్టుకుంటే చాలు! కుండ మొత్తం పిసకాల్సిన పని లేదు!! కాళేశ్వరం గొప్పతనమేందో తెలుసుకునేందుకు ఆ గీత పక్కన ఉమ్మడి రాష్ట్రంలో ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు గీసిన ఒక గీతను పెట్టే ప్రయత్నమే ఇది అంతే! కాళేశ్వరం గొప్పతనమేందో ఆ గీతలే వివరిస్తాయి. నిప్పుకు చెదలా… ఒక బరాజ్‌లో ఒక పిల్లర్ కుంగిన ఘటనను తీసుకొని రాజకీయ యాగీ చేసినంత మాత్రాన కాళేశ్వరం గొప్పతనాన్ని మసకబార్చలేరు.కేసీఆర్ భగీరథ సంకల్పాన్ని.. చరిత్రను చెరిపేయలేరు.
మేడిగడ్డను ఎండబెడితే… మిడ్‌మానేరుకు గోదారిని ఎత్తిపోసే బాహుబలి మోటార్లు… మిడ్‌మానేరు నుంచి పలు దశల్లో కొండపోచమ్మసాగర్‌కు ఎదిగి దుంకే గోదావరి సవ్వడులు.. హైదరాబాద్ నగరవాసుల దాహార్తిని తీర్చే మల్లన్నసాగర్ కాళేశ్వర జలాలు… ‘జై కాళేశ్వరం జైజై కేసీఆర్’ అని నినదిస్తూనే ఉంటాయి అంటూ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి గుండాల కృష్ణ రాసిన ప్రత్యేక కథనం
1.నాడు పెను గంగకు 47 ఏండ్లు కాళేశ్వరం మూడేండ్లలోనే!
ఐదు టీఎంసీల ప్రాజెక్టు కోసం మూడున్నర దశాబ్దాల డ్రామా నడపొచ్చనే అద్భుతమెక్కడైనా విన్నారా? అదే పెనుగంగ ప్రాజెక్టు. 1978లో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం, తెలంగాణ ఏర్పడేనాటికి ఈ ప్రాజెక్టు కోసం తట్టెడు మట్టి పని జరగలేదు. సర్వేలు అంటూ అక్షరాలా 62 లక్షల రూపాయలు ఖర్చు చూపారు. తెలంగాణలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016లో మళ్లీ మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని చనాక-కొర్టా బరాజ్‌ను నిర్మించింది. 45 లక్షల ఎకరాలకు సాగు నీరందించే కాళేళ్వరాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసింది. అందుకే మంటి పనికైనా ఇంటోడు ఉండాలనే సామెత తెలంగాణ గడ్డ మీద ఊరికనే పుట్టలేదు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేవలం ఐదు టీఎంసీలు అందిస్తే దాదాపు 50వేల ఎకరాలకు సాగునీరు అందుకొని జీవితాన్ని గడపాలని ఆ ప్రాంత రైతులు ఆశపడ్డారు. వారి ఆశల్ని ఓట్లుగా మలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాగితాల మీద పెట్టిందే లోయర్ పెనుగంగ ప్రాజెక్టు. 1978, ఆగస్టు 7న మహారాష్ట్ర-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు లోయర్ పెనుగంగపై అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆ తర్వాత మూడున్నర దశాబ్దాలకు పైగా జనాన్ని ఏమారుస్తూ వచ్చారు. కనీసం పెనుగంగపై చనాకా-కొర్టా బరాజ్ ఒక్కటి కట్టినా దశాబ్దాలుగా ఆశపడిన రైతులకు కొంచమైనా ఫలాలు అందేవి. చివరకు తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా కాగితాల మీదున్న పెనుగంగ ప్రాజెక్టును భూమి మీదకు తీసుకువచ్చారు. ప్రధాన డ్యాం నిర్మాణానికి 2016 జూలై 4న రూ.1227 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం పాలనా అనుమతి ఇవ్వడమే కాదు, మహారాష్ట్రను ఒప్పించి 2016 ఆగస్టు 23న చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. రూ.368 కోట్లతో టెండర్లు పూర్తి చేసి, పనులు కూడా పూర్తి చేయడంతో 13,500 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు బేల, జైనాధ్, ఆదిలాబాద్, తామ్సీ మండలాల పరిధిలోని 98 గ్రామాలకు సాగు, తాగునీరు అందుతున్నది.
మూడేండ్లలోనే తెలంగాణ మాగాణం
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అనేది కాంగ్రెస్ హయాంలో తెరపైకి రాలేదు. హైదరాబాద్ స్టేట్‌లోనే 300 టీఎంసీల గోదావరి జలాల వినియోగం కోసం రూపొందించిన ప్రాజెక్టు అది. వైఎస్ హయాంలో విష వలయంలో అమర్చి 2008లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అంటే దశాబ్దాల పాటు గోస తీసిన ప్రాజెక్టు అది. చివరకు కేసీఆర్ రీడిజైనింగ్‌లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుగా దానికి రూపకల్పన చేశారు. 2014, జూన్ 2న కేసీఆర్ ప్రభుత్వం కొలువుదీరింది. 2015లో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా లైడార్ సర్వే చేపట్టింది. 2016 మే, 2వ తేదీన సీఎం కేసీఆర్ లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్‌కు శంకుస్థాపన చేశారు. మూడు నెలల వ్యవధిలోనే మహారాష్ట్రతో కీలకమైన అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని పూర్తి చేశారు. కాలంతో పోటీ పడుతూ పని చేయించడంతో 2019 జూన్ 21న ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల సాధ్యమైంది. మూడు సంవత్సరాల్లోనే ప్రాజెక్టు ఫలాలు రైతులకు అందడం మొదలైంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మేం రికార్డుస్థాయిలో ధాన్యం పండిస్తున్నాం.. అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు.
2. నీళ్లున్న చోట తొలిసారి!
తెలంగాణ ఏర్పడేనాటికి గోదావరిపై ప్రాజెక్టుల పేరిట ఖర్చు చేసిన మొత్తం ఏకంగా రూ.30 వేల కోట్లకు పైగా ఉంటే మొన్నటిదాకా గోదావరిలో తెలంగాణకు దక్కింది కనాకష్టంగా వంద టీఎంసీలు! అది కూడా శ్రీరాంసాగర్‌కు వరద వస్తేనే! మరి ఒక్క కాళేశ్వరంతో ఇప్పుడు తెలంగాణ రోజుకు మూడు టీఎంసీల ప్రాణహితజలాలను ఎత్తిపోసుకునే వ్యవస్థ ఉంది. అందుకే నీళ్లు ఒకచోట ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి ప్రాజెక్టులు మరో చోట్ల డిజైన్ చేశారు. అవిగో ప్రాజెక్టులు.. అల్లదిగో గోదావరి జలాలు.. అనే విష వలయాన్ని కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ఛేదించారు.
కుట్రపూరితంగా పక్కన పెట్టేశారు
సుదీర్ఘ గోదావరి మహారాష్ట్రలో పుట్టి.. తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరి ఆపై కడలిలో కలుస్తుంది. ఈ ప్రస్థానంలో ఉప నదులు కలిసి గోదావరికి జీవం పోస్తాయి. అందుకే గోదావరిని 12 సబ్ బేసిన్లుగా విభజించారు. ఇందులో మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి సంగమించే ప్రాణహిత.. ఒడిశా, చత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణలో ప్రవేశించి కలిసే ఇంద్రావతి.. దిగువన ఏపీలోకి ప్రవేశించగానే వచ్చి చేరే శబరి.. కేవలం ఈ మూడు సబ్ బేసిన్ల నుంచి 61.13 శాతం జలాలు వచ్చి గోదావరిలో చేరుతాయి. అంటే ఒక ఏడాది గోదావరిలో 1000 టీఎంసీల నీళ్లు ఉంటే అందులో కేవలం ఈ మూడు సబ్ బేసిన్ల నుంచే 611 టీఎంసీలు వస్తయన్నమాట. ఇందులో శబరి ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. అంటే తెలంగాణకు జీవధారలు ప్రాణహిత, ఇంద్రావతి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడేనాటికి గోదావరి జలాల వినియోగానికి అద్భుతమైన ప్రాజెక్టులను రూపొందించారు. 330 టీఎంసీల ప్రధాన గోదావరిజలాల వినియోగానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రూపకల్పన జరిగితే, మరో 300 టీఎంసీల ప్రాణహిత-ఇంద్రావతి వినియోగానికి ఇచ్చంపల్లి ప్రాజెక్టును రూపొందించారు.
దీనికి అదనంగా వంద టీఎంసీల వినియోగానికి కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేశారు. ఇలా నీళ్లున్న చోట ప్రాజెక్టులను కట్టేలా డిజైన్ చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్‌తో కలిసిన తర్వాత ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు వీటన్నింటినీ కుట్రపూరితంగా పక్కన పెట్టాయి. తెలంగాణ ఏర్పడే నాటికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టును కూడా ప్రాణహితగానీ, ఇంద్రావతి జలాల ఆధారంగా నిర్మించలేదు. దేవాదుల ప్రాజెక్టు చేపట్టినా నదిపై చుక్క నీటి నిల్వ లేకుండానే డిజైన్ చేశారు. అప్పర్ గోదావరి (జీ1), ప్రవర (జీ2), పూర్ణ (జీ3), మంజీరా (జీ4), మధ్య గోదావరి (జీ5), మానేరు (జీ6)పైనే ప్రాజెక్టులు కట్టారు. కాకపోతే తెలంగాణ సమాజాన్ని మభ్య పెట్టేందుకు ఉమ్మడి రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. తెలంగాణ ఏర్పడేనాటికి గోదావరి ప్రాజెక్టులపై రూ. 30వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి. శ్రీరాంసాగర్‌కు మంచి ఇన్‌ఫ్లో వస్తే ఆ ఏడాది వంద టీఎంసీల వరకు వినియోగం జరిగేది. లేకపోతే గోదావరి బేసిన్ అంతా ఎడారే. కానీ ప్రతి సంవత్సరం వేలాది టీఎంసీల గోదావరిజలాలు పోలవరం మీదుగా ధవళేశ్వరం ప్రాజెక్టుకు చేరి ఆపై సముద్రంలో కలుస్తున్నాయి.
రికార్డు వడ్లే అసలు అవార్డు
తెలంగాణ రైతులు రికార్డుస్థాయిలో వడ్లు పండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రుల నోటి నుంచి అనేకసార్లు వచ్చిన మాటలివి. వీరంతా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో ఉన్నవారే. కానీ అప్పట్లో ఏ ఒక్కనాడు కూడా ఈ మాట వారి నోటి నుంచి రాలేదు. ఎందుకంటే ప్రాణహిత, ఇంద్రావతి జలాల వినియోగమే లేదు. కానీ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత గోదావరి బేసిన్ ముఖచిత్రమే మారిపోయింది. తెలంగాణ ఏర్పడేనాటికి 90 టీఎంసీల శ్రీరాంసాగర్ అతి పెద్ద ప్రాజెక్టు. కానీ ఇప్పుడు బేసిన్లో దాదాపు 350 టీఎంసీల గోదావరి జలాలను నిల్వ చేసుకునేంత సామర్థ్యం తెలంగాణకు వచ్చింది. గోదావరి బేసిన్లో 350 టీఎంసీల నిల్వ ఉందంటే వినియోగం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీనికి ప్రధాన కారణం ప్రాణహితజలాల వినియోగం. మేడిగడ్డ దగ్గర ప్రాణహిత జలాల్ని ఒడిసిపట్టి ప్రధాన గోదావరి మీదుగా బేసిన్ మొత్తాన్ని సస్యశ్యామలం చేసే శక్తియుక్తులు ఇప్పుడు తెలంగాణ సొంతం. చివరకు బకెట్ నీటిని కూడా ఒడిసిపట్టలేని దేవాదులకు సమ్మక్క బరాజ్ ద్వారా ఏడాది పొడవునా అవసరమున్నపుడు నీటిని ఎత్తిపోసుకునే ఒడుపు తెలంగాణ సొంతమైంది. ఆరొందల మీటర్ల దిగువన పోతున్న జలాల్ని ఎత్తి లక్షలాది బీడుల్ని మాగాణం చేసే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ సాకారం చేశారు.
గోదావరిలో 75 శాతం డిపెండబిలిటీపై నీటి లభ్యత 3,216 టీఎంసీలుగా ఉన్నప్పుడు సబ్ బేసిన్ల నీటి లభ్యత వాటా ఇలా
సబ్ బేసిన్-నీటి లభ్యత వాటా (శాతాల్లో)
3. అంచనాకు 400 రెట్లు దాటిన శ్రీరాం సాగర్ వ్యయం అంచనా తప్పని కాళేశ్వరం
ఒక సాగునీటి ప్రాజెక్టు మొదలుపెట్టిన సమయంలోని అంచనా వ్యయం ఏకంగా 400 రెట్లకు పైగా పెరగడం ఎప్పుడైనా విన్నారా? అదే తెలంగాణలో గోదావరికి ముఖద్వారం.. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు. 1963లో నాటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేసినపుడు అంచనా వ్యయం 40 కోట్లు.. పూర్తయ్యే నాటికి 17 వేల కోట్లకు చేరింది. రిజర్వాయర్ నిర్మించి కాల్వలు తవ్వేలోపే సామర్థ్యం పడిపోయింది.
ఫేజ్-1, ఫేజ్-2 అనేలోపు కాల్వలు శిథిలావస్థకు చేరాయి. దీనిపై మరో రెండు లిఫ్టులు పూర్తయ్యేసరికి అసలు ప్రధాన గోదావరినే ఒట్టిపోయింది. అంచనా వ్యయం రూ. 17 వేల కోట్లకు పెరిగినా పూర్తిస్థాయి ఫలాలు అందని దుస్థితి. ఇలాంటి ప్రాజెక్టు నిర్మించిన కాంగ్రెస్, ప్రతిపాదిత సమయం(మూడేండ్లు)లోనే రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టి, అంతే వ్యయంతో పూర్తయిన కాళేశ్వరంపై విమర్శలు చేస్తున్నది. మూడో టీఎంసీ అంచనా వ్యయాన్ని జోడించి అంచనాలు పెరిగాయని అబద్ధాలు వల్లేవేస్తున్నది. ఘనత వహించిన కాంగ్రెస్ నిర్మాణం ఎస్సారెస్పీతో కాళేశ్వరాన్ని పోలిస్తే 399 రెట్లు ప్రజల సొమ్ము ఆదా అయినట్టే.
తెలంగాణ ఖాతాలో ఒక సాగునీటి ప్రాజెక్టును చూపించాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో చేపట్టిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనులు 1963లో మొదలైతే తెలంగాణ ఏర్పడేనాటికి సగం కూడా పూర్తవలేదు. 1964లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.40 కోట్లు. మొదటి దశ పూర్తయ్యే నాటికి దాని అంచనా విలువ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలకు చేరుకున్నది. రెండో దశ కింద కాకతీయ కాల్వ విస్తరణ. 1990లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు శంకుస్థాపన చేసిన ఎస్సారెస్పీ వరద కాల్వ, దానికి అనుబంధంగా మధ్య మానేరు, తోటపల్లి, గౌరవల్లి జలాశయాలు కాల్వలు. 2.52 లక్షల ఎకరాలకు సాగునీరు అంటూ మరో ప్రాజెక్టు చేపట్టారు. 1996లో రెండో దశ అంచనా విలువ రూ.1331 కోట్లు. ఆపై 2009లో 4,729.26 కోట్లకు పెరిగింది. అలా ఇంతింతై… అన్నట్టు శ్రీరాంసాగర్ ప్రస్థానం రూ.40 కోట్లతో మొదలై రూ.17వేల కోట్లకు పైగా చేరింది. ముఖ్యంగా 346 కిలోమీటర్ల మేర నిర్మించిన కాకతీయ కాల్వ తెలంగాణ ఏర్పడేనాటికి దశాబ్దాలుగా నీళ్లు పారక, నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. వాస్తవంగా శ్రీరాంసాగర్ నిర్మాణ డిజైన్‌లో 75 శాతం డిపెండబులిటీపై సుమారు 156 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కగడితే.. మహారాష్ట్రతో చేసుకున్న లోపభూయిష్టమైన అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని ఆ రాష్ట్రం ఎగువన ఎడాపెడా ప్రాజెక్టులు నిర్మించింది. చివరకు శ్రీరాంసాగర్ ఎఫ్ఆర్ఎల్లోనే బాబ్లీని కట్టింది. దీంతో నీటి లభ్యతలో భారీ లోటు ఏర్పడింది. దీనికి తోడు 112 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో జలాశయాన్ని నిర్మిస్తే ఇప్పుడు అది 80 టీఎంసీల సామర్థ్యానికి కుంచించుకుపోయింది. దీంతో 16 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో మొదలైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు భవితవ్యం ఆగమ్యగోచరంగా తయారైంది.
వేల కోట్ల భారాన్ని తప్పించిన కాళేశ్వరం
దేశ సాగునీటి చరిత్రలో ఏ ప్రాజెక్టును తీసుకున్నా దశాబ్దాల కాల వ్యవధి. ఫలితంగా వేల కోట్ల అంచనా వ్యయం పెంపు. ఏటా పెరిగే స్టీలు, సిమెంటు ధరలే తడిసిమోపడవుతాయి. అలాంటిది కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016 మేలో శంకుస్థాపన చేసి 2019లోనే అందుబాటులోకి తీసుకువచ్చింది. గత సంప్రదాయం ఈ ప్రాజెక్టులోనూ పునరావృతమైతే ప్రస్తుతానికి దాని అంచనా వ్యయం కనీసంగా రూ.2 లక్షల కోట్లకు దరిదాపుల్లో ఉండేది. మూడో టీఎంసీని జోడించడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం లక్ష కోట్ల మార్కును దాటింది. మూడేండ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవడంతో అతి తక్కువ వ్యయంతోనే తెలంగాణ గడ్డపై 141 టీఎంసీల జలాలను నిల్వ చేసుకునే సామర్థ్యం వచ్చింది. ముఖ్యంగా కాళేశ్వరంలో ఏడు ప్యాకేజీలతో గోదావరిలో ఎక్కడ నీటి లభ్యత ఉంటే అక్కడి నుంచి ఎత్తిపోసుకొని అవసరాలకు తగినట్టు వాడుకునే వెసులుబాటు ఉంది. కేవలం ప్రాణహితలోనే ఇన్‌ఫ్లోలు ఉంటే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తద్వారా బాహుబలి మోటార్ల ద్వారా ఎగువన కొండపోచమ్మసాగర్ దాకా నీటిని తీసుకుపోవచ్చు. ఎల్లంపల్లికి ఇన్‌ఫ్లోలు ఉంటే మేడిగడ్డ నుంచి ఎత్తిపోత అవసరముండదు. శ్రీరాంసాగర్‌కు వరద వస్తే మేడిగడ్డ-ఎల్లంపల్లి-మిడ్‌మానేరు లింకుల్లోని ఎత్తిపోతలు నిలిపివేయొచ్చు. వీటన్నింటికీ తోడు కాళేశ్వరం ప్రాజెక్టుతో శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, ఎల్ఎండీతో పాటు సింగూరు, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టులకు సైతం జీవం వచ్చింది.
1.2 లక్షల కోట్లుమూడేండ్లలో కాళేశ్వరాన్ని నిర్మించడంతో ప్రజాధనం ఆదా
4.దేవాదులతో గ్లాసు నీటికి ఏడు రూపాయలు!
కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రారంభోత్సవం రోజునే పైపులు టపాసుల్లా పేలి గోదారమ్మ ఆకాశాన్ని ముద్దాడింది. అదే దేవాదుల ప్రాజెక్టు. 2008 నుంచి 2019 వరకు రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తే ఎత్తిపోసింది కేవలం 66 టీఎంసీలు. అందుకే దేవాదుల ప్రాజెక్టు అంటే ఒక్క గ్లాసు నీటికి ఏడు రూపాయలు అనే వెటకారపు విశ్లేషణలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. సమ్మక్క-సారక్క బరాజ్ నిర్మించేదాకా జీవచ్చవంలా ఉన్న దేవాదుల ఎక్కడ? ప్రాజెక్టు ప్రారంభించిన ఈ ఆరేండ్లలో వందల టీఎంసీల గోదావరి జలాల్ని బీడు భూములకు తరలించడమే కాకుండా 141 టీఎంసీల రిజర్వాయర్లను పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ?
కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సెగను తట్టుకోలేక 2003లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు దారిలేకున్నా గోదావరి చెంతకు ఒక మేస్త్రీని హెలిక్యాప్టర్‌లో ఎక్కించుకొని శిలాఫలకం వేసిన చరిత్ర ఈ ప్రాజెక్టుది. వంద గజాల్లో ఇల్లు కట్టుకుంటే కనీసం రెండు వేల లీటర్ల సంపు లేదా ట్యాంకు ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం ఉమ్మడి ఏటూరు నాగారం పరిధిలోని గంగారం వద్ద గోదావరి నదిపై ఇన్‌టేక్ పాయింట్ (చిన్న బావి లెక్క గుంత) ఏర్పాటు చేశారు. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టును ప్రారంభించిన సమయంలో పైపులైన్లు పేలి నీళ్లు ఆకాశం ఎత్తున ఎగిసిపడ్డాయి. 2014 వరకు ఈ ప్రాజెక్టు కింద రూ.రూ.4,513.91 కోట్లు ఖర్చు చేశారు. అప్పటివరకు కేవలం పదిహేను టీఎంసీల గోదావరి జలాల్ని తెలంగాణ గడ్డ మీదకు ఎత్తిపోశారు. అంటే అప్పటివరకు జరిగిన వ్యయం, ఎత్తిపోసిన నీటిని బేరీజు వేస్తే రూ.300 కోట్లకు ఒక్క టీఎంసీని లిఫ్టు చేసినట్టుగా తేలుతుంది. చివరకు కేసీఆర్ రీడిజైనింగ్‌లో భాగంగా లోపభూయిష్టంగా ఉన్న డిజైన్‌ను సరిదిద్దేందుకు దేవాదుల ఇన్‌టేక్ పాయింట్ దిగువన సమ్మక్క (తుపాకులగూడెం) బరాజ్‌ను నిర్మించారు.
వంద కిలోమీటర్లకు పైగా సజీవ గోదావరి
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగే వివక్షను చూసి చలించిన రిటైర్డ్ ఇంజినీర్ హనుమంతరావు సైతం ‘తెలంగాణ గోదావరిపై వరుస బరాజ్‌లను నిర్మించుకుంటే బాగుపడ్తది’ అని సూచించారు. దిగువన సమ్మక్క బరాజ్, దాని మీద మేడిగడ్డ, ఆపై అన్నారం, సుందిల్ల.. దాని ఎగువన ఎల్లంపల్లి.. ఇంకో వరసలో ఎల్ఎండీ, మిడ్‌మానేరు… పునర్జీవ పథకంతో శ్రీరాంసాగర్ వరద కాల్వ, దాని మీద శ్రీరాంసాగర్ రిజర్వాయర్.. ఇలా వందల కిలోమీటర్ల గోదావరి ఏడాది పొడవున నీటి నిల్వతో సజీవంగా ఉండాలనే స్వప్నంతో రీడిజైనింగ్ చేపట్టారు. పట్టుబట్టి పూర్తి చేసి 130 కిలోమీటర్లకు పైగా సజీవ గోదావరి జల దృశ్యాలను తెలంగాణ సమాజం కండ్ల ముందు ఉంచారు. ఈ నేపథ్యంలో లీటరు నీటి నిల్వలేని దేవాదుల ఎక్కడ? వందల కిలోమీటర్ల సజీవ జల దృశ్యాల కాళేశ్వరం ఎక్కడ??
5.భాగ్యనగరికిదే జల భాగ్యం
ఒక ప్రాజెక్టును వ్యతిరేకించిన నోళ్లు అదే ప్రాజెక్టును ప్రశంసిస్తే! ఒక నిర్మాణానికి వ్యతిరేకంగా ధర్నాలు చేసిన వాళ్లే పూర్తయిన ఆ నిర్మాణానికి దండం పెడితే! నిజమే.. ఆ ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుదే. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మొదలు గతంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ తాగునీటి వ్యవస్థకు ఆ మల్లన్నసాగరమే భవిష్యత్తు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీటితో పాటు మూసీ ప్రక్షాళనకు కూడా గోదావరి జలాలను తరలించనున్నారు. ఆ పథకం పనులకు భూమిపూజ సందర్భంగా రేవంత్‌రెడ్డి కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు చేతులెత్తి మొక్కాల్సిందే.
హైదరాబాద్ తాగునీటికి కేసీఆర్ శాశ్వత భరోసా
హైదరాబాద్‌లో ఎండాకాలం వచ్చిందంటే జలమండలి కార్యాలయం ముందు ఖాళీ బిందెల ప్రదర్శన ఓ ఆనవాయితీగా ఉండేది. కాలనీల్లో ట్యాంకర్ల వద్ద నీటి యుద్ధాలు నిత్యకృత్యంగా కనిపించేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ నుంచి రైల్వే వ్యాగన్లలోనూ నీటిని నగరానికి తరలించిన చరిత్ర హైదరాబాద్‌కు ఉంది. పూర్వం హుస్సేన్‌సాగర్ నుంచి రా వాటర్‌ను తీసుకొని నారాయణగూడలో ఉన్న ఫిల్టర్ బెడ్లలో శుద్ధి చేసి హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించేవారు. అంటే నగరం పరిధిలోనే తాగునీటి సరఫరా వ్యవస్థ ఉండేది. కాలక్రమేణా హుస్సేన్ సాగర్ అది కాలుష్య కూపంలా తయారై కనీసం ఆ నీటిని ముట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ విశ్వనగరంగా విస్తరించడంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా, గోదావరి… ఇలా వందల కిలోమీటర్ల దూరం నుంచి నదీజలాల్ని తరలించినా హైదరాబాద్ తృష్ణ తీరడం లేదు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పటికప్పుడు కొత్తగా తాగునీటి పథకాలు చేపట్టి నగరానికి నీటిని తరలించారేగానీ ఒక సాగునీటి ప్రాజెక్టులో అంతర్భాగంగా హైదరాబాద్‌కు శాశ్వత భరోసా కల్పించిన దాఖలాలు లేవు.
కాళేశ్వరం గంగతో శాశ్వత భరోసా
ప్రస్తుతం హైదరాబాద్‌లో తాగునీటికి ఢోకా లేకున్నా, విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ఈ మహా నగరం పరుగులు ఆగకుండా ఉండాలంటే పుష్కలమైన నీటి వసతితో శాశ్వత భరోసా ఉండాలి. అందుకే కేసీఆర్ కాళేశ్వరం రూపకల్పనలోనే ముందుచూపుతో వ్యవహరించారు. నగరానికి సమీపంలోనే 15 టీఎంసీల కొండ పోచమ్మ సాగర్, 50 టీఎంసీల మల్లన్నసాగర్ భారీ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ తాగునీటికి 30 టీఎంసీలను కేటాయించడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు సైతం మరో 16 టీఎంసీలను కేటాయించారు. ఈ నేపథ్యంలో గత కేసీఆర్ ప్రభుత్వం కొండపోచమ్మసాగర్ నుంచి నగరానికి తాగునీరు, మూసీ ప్రక్షాళనకు గోదావరి జలాల్ని తరలించాలని నిర్ణయించింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం నీటి సేకరణ వనరును మల్లన్నసాగర్‌కు మార్చుకుంది. అయినప్పటికీ అది కూడా కాళేశ్వరంలోని అంతర్భాగమే. దీంతో మరికొన్ని సంవత్సరాల్లో నగరానికి అదనంగా రోజుకు 340 మిలియన్ గ్యాలన్ల తాగునీరు రావడంతో పాటు మురికికూపంగా తయారైన మూసీ గోదావరిజలాలతో విముక్తి పొందనుంది.