స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 25: అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తున్న తెలంగాణను చూసి బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. రాజకీయ స్వార్థం కోసం మతచిచ్చు రేపుతున్న బీజేపీని తెలంగాణలో లేకుండా చేస్తేనే రాష్ట్రం బాగు పడుతుందని స్పష్టం చేశారు. గురువారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు.
2014కు ముందు తీవ్రమైన కరెంటు కోతలు, కరువుకాటకాలతో తెలంగాణ ప్రజలు వలస వెళ్లేవారని, స్వరాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ పాలనలో 24 గంటల నాణ్యమైన కరెంటు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీరు అందుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవడం తప్ప బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, దాడులు చేసినా, నాటకాలు ఆడినా ముచ్చటగా మూడోసారి తెలంగాణ సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు.