ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 13: రాష్ర్టాల హక్కులను హరించేలా రాజ్యాంగం ఉండకూడదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో అంశాలను సవరించి రాష్ర్టాలకు సంపూర్ణమైన అధికారాన్ని ఇచ్చేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలని అభిప్రాయపడ్డారు. దానికి తగ్గట్టుగా రాజ్యాంగాన్ని సవరణ చేయాలన్నదే సీఎం కేసీఆర్ వ్యాఖ్యల ఉద్దేశమని గుర్తుచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగం ఆధ్వర్యంలో ‘ద పారడాక్స్ ఆఫ్ ఫెడరలిజం -ఎ త్రెట్ టు ద నేషన్’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును బుధవారం పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా కే కేశవరావు హాజరై, మాట్లాడుతూ.. రాష్ర్టాల సమాఖ్యే భారతదేశం అని రాజ్యాంగంలోని ఒకటో అధికరణ స్పష్టంగా పేర్కొన్నదని, కానీ దీనికి భిన్నంగా బీజేపీ ప్రభుత్వం ఒకే భాష – ఒకే దేశం – ఒకే పన్నుల విధానం – ఒకే విద్య లాంటి ఏకీకృత విధానాలను అమలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇది రాష్ర్టాల హక్కులను హరించివేయడమేనని, దీనినే కేసీఆర్ వ్యతిరేకించారని వెల్లడించారు.
కేంద్రం, రాష్ర్టాల మధ్య అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి జరుగుతుం దని అభిప్రాయపడ్డారు. సదస్సు కన్వీనర్, ఓయూ లా విభాగం డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. అన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలను సమానంగా గౌరవించే సెక్యులర్ విధానాలను అమలు చేయాలని డాక్టర్ అంబేద్కర్ ఆకాంక్షించారని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు మాట్లాడుతూ.. రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా కేంద్రం తన విధాన నిర్ణయాలతో రాష్ర్టాలపై తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కోచ్చిలోని నేషనల్ లా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ సన్నీ, ఓయూ లా విభాగం హెడ్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఓయూ లా కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రాధికాయాదవ్, ఓయూ లీగల్ సెల్ డైరెక్టర్ డాక్టర్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.