హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరంపై ఏర్పాటైన విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఆరా తీస్తున్నారు. గత ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చిన విషయం తెలిసిందే. ఈ అంశాలపైనే జస్టిస్ ఘోష్ దృష్టి సారించినట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా శుక్రవారం ఆయన ఈఎన్సీ జనరల్ కార్యాలయం, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) విభాగాల ఇంజినీర్లను విచారించారు.
ప్రాణహిత – చేవెళ్లపై విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికను ఎందుకు పకన పెట్టారు? కాళేశ్వరం ఎందుకు చేపట్టారు? అని ఇంజినీర్లను ప్రశ్నించినట్టు తెలిసింది. 2015లో ప్రాణహిత చేవెళ్లపై రిటైర్డ్ ఇంజినీర్లు ఇచ్చిన రిపోర్టును అందజేయాలని జస్టిస్ ఘోష్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఆ తర్వాత మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారించినట్టు కమిషన్ అధికారవర్గాలు వెల్లడించాయి.
ఇంజినీర్లకు సంబంధించి విచారణ దాదాపుగా పూర్తయిందని తెలిపాయి. తుది నివేదికనివ్వాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి సూచించినట్టు వివరించాయి. కాళేశ్వరం ప్లానింగ్‌పై పుణె సీడబ్ల్యూపీఆర్ఎస్ నుంచీ నివేదికలను కోరినట్టు వెల్లడించాయి. మొత్తంగా జూలై మొదటి వారంలో ఆయా నివేదికలు వచ్చే అవకాశముందని, 27లోగా అన్ని అఫిడవిట్లు వచ్చాక 10రోజులు పూర్తిస్థాయిలో జస్టిస్ పీసీ ఘోష్ విచారణ జరుపనున్నట్టు కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి.