Justice L. Narasimha Reddy | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్‌గఢ్ విద్యుత్తు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి పవర్ప్లాంట్ల నిర్మాణంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంధించిన లేఖపై స్పందించారు. కేసీఆర్ లేవనెత్తిన అభ్యంతరాలను తాము పునఃపరిశీలిస్తామని తెలిపారు. కేసీఆర్ శనివారం పంపించిన లేఖలో కమిషన్ చట్టబద్ధతను ప్రశ్నించారు. కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నర్సింహారెడ్డి ఆదివారం ఒక న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. కేసీఆర్ లేఖపై నిపుణులతో చర్చిస్తానని తెలిపారు. లేఖలో కొన్ని ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలిచ్చారని, పలు అంశాలను లేఖలో ప్రస్తావించారని, కేసీఆర్ చెప్పిన వివరాలకు, వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉన్నదని పేర్కొన్నారు.కేసీఆర్ రాసిన లేఖపై కమిషన్ మంగళవారం సమీక్షించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
మంగళవారం మరో ఇద్దరి విచారణ
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదంరాం, విద్యుత్తు జేఏసీ నేత రఘును కూడా జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ మంగళవారం విచారించనున్నది. ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు హాజరుకావాలని వారిద్దరికీ విచారణ కమిషన్ కార్యాలయ వర్గాలు సమాచారాన్ని అందించాయి.