హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసే ఆరోపణలకు ప్రామాణికత ఉండాలని, కేవలం ఆరోపణలు, వాదనలను పరిగణించబోమని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టంచేసింది. తాను చేస్తున్న ఆరోపణలకు తగిన ఆధార పత్రాలు లేకుండా ప్రాజెక్టుపై వ్యక్తిగతంగా పలు అంశాలను వెల్లడిస్తూ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్ దాఖలు చేసిన అఫిడవిట్‌పై కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ చేపట్టిన బహిరంగ విచారణ బీఆర్కే భవన్లో సోమవారం కొనసాగింది. విద్యుత్త్తు జేఏసీ నేత, ఇంజినీర్ కే రఘును జస్టిస్ ఘోష్ ఈ సందర్భంగా విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కరెంటు ఖర్చులతోపాటు అనేక అంశాలపై రఘు దాఖలు చేసిన అఫిడవిట్‌పై పలు ప్రశ్నలు అడిగారు. అఫిడవిట్లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? అని అడిగారు.
తనకు ఆన్లైన్లో లభించిన, వ్యక్తిగతంగా సేకరించిన సమాచారం ఆధారంగానే అఫిడవిట్ దాఖలు చేసినట్టు రఘు వివరించారు. దీనిపై జస్టిస్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. ఆ పత్రాలకు ప్రామాణికత ఏముంటుందని నిలదీశారు. న్యాయ సమీక్ష ముందు అలాంటి పత్రాలు చెల్లబోవని స్పష్టం చేశారు. ప్రామాణికత లేని పత్రాలను పరిగణించబోమని జస్టిస్ ఘోష్ ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. వ్యక్తిగత కక్షలతో కూడా ప్రాజెక్టుపై తప్పుడు సమాచారమిచ్చే అవకాశముంటుంది కదా? అని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ వెంటనే విచారణను ముగించింది. ఇదిలా ఉండగా విచారణ అనంతరం విద్యుత్తు ఇంజినీర్ రఘు స్థానిక మీడియాతో మాట్లాడారు. గతంలో ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలనే మళ్లీ ఏకరువు పెట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విద్యుత్తు ఇంజినీర్ రఘు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమనాయకుడిగా ఇంజినీర్ రఘుపై అపార గౌరవముందని, విద్యుత్తు సమస్యలపై ఉద్యమ కాలంలో రఘు చేసిన సలహాలు, సూచనలు ఉద్యమానికి ఎంతగానో దోహదపడ్డాయని గుర్తుచేశారు. అయి తే రఘుకు విద్యుత్తు రంగంపై ఉన్న అవగాహన నీటిపారుదల రంగంపై ఏమాత్రం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కరెంటు ఖర్చులు, నీటిలభ్యత తదితర అంశాలపై ఆయన చేస్తున్న విమర్శలే అందుకు నిదర్శమని వివరించారు.
నీటివనరులపై రఘు మరింత అవగాహన పెంచుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యక్తిగతంగా, కుట్రపూరితంగా కొందరు చేస్తున్న ఆరోపణలే నిజమని రఘు భావిస్తున్నారని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రాజెక్టుపై రాజకీయ పార్టీలు, ఇతరులు చేస్తున్నవన్నీ ఆరోపణలేనని, అసంబద్ధమైనవేనని కమిషన్‌కు తాను సహేతుకమైన ఆధారాలతో నివేదించానని గుర్తుచేశారు. రఘు తన వాదనలకు సహేతుకమైన పత్రాలను సమర్పించలేదని తెలిపారు. ప్రాజెక్టుపై చేస్తున్న ప్రచారమంతా అసత్యమనడానికి ఇదొక్కటి చాలని ప్రకాశ్ పేర్కొన్నారు.