ఊట్కూర్ (కృష్ణ), జూలై 20 : ‘నమస్తే తెలంగాణ’ మాగనూరు రిపోర్టర్ రాము, ఫొటోగ్రాఫర్ తాహేర్అలీపై జరిగిన దాడిని ఖండిస్తూ జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం టైరోడ్డు వద్ద సోమవారం భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా, మాఫియా కార్యకలాపాలను ప్రశ్నించినందుకే జర్నలిస్టులపై దాడి చేశారని, ఇది రాష్ట్రంలో, మంత్రి శ్రీహరికి సంబంధించిన మక్తల్ నియోజకవర్గంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నంసహా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. గంటసేపు ధర్నా జరగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి రాకపోకలు స్తంభించాయి. సీఐ రామ్‌లాల్ నిందితులను శిక్షించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కృష్ణానది పరీవాహక ప్రాంతంలో అధికార పార్టీ నాయకుల అండతో వందలాదిగా టిప్పర్లలో నిత్యం ఇసుకను తోడేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కృష్ణ మండల ఎస్సై నవీద్ ఇసుక మాఫియాకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదని స్థానిక రైతులు తెలియజేయడంతో వెలుగులోకి తీసుకొచ్చేందుకు వెళ్లిన జర్నలిస్టులపై దాడులు జరుగడం దుర్మార్గమని మండిపడ్డారు. కలెక్టర్, ఎస్పీ స్పందించి దాడికి కారణమైన కాంగ్రెస్ నాయకుడు నారాయణ, అతడి అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కృష్ణ మండలంలో ఇసుక అక్రమ రవాణాను వెలుగులోకి తీసుకొచ్చేందుకు వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’ జర్నలిస్టులపై ఇసుక మాఫియా దాడి అత్యంత హేయమైనదిగా పేర్కొన్నారు.