హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేసులు భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అభిప్రాయపడ్డారు. వార్తలు రాసి, ప్రసారం చేసే జర్నలిస్టులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టించడం సరికాదని పేర్కొన్నారు. ప్రసారమైన వార్తపై ఏమైనా సందేహాలు ఉన్నా, తప్పుడు వార్తగా భావించినా.. వాటిని ఖండించాలి తప్ప, కేసులు పెట్టడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాజాగా సీనియర్ జర్నలిస్టు శివారెడ్డిపై ములుగు జిల్లాలో కేసు నమోదు చేయడాన్ని టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. శివారెడ్డిపై కేసును వెంటనే ఉప సంహరించుకోవాలని టీయూడబ్ల్యూజేతోపాటు తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్(టీఈఎంజేయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్‌రెడ్డి, రమణకుమార్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్‌లోని పిల్లర్ కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నివేదిక సమర్పించడంలో జాప్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్ర జలశక్తిశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్ స్పష్టంచేశారు. ఎన్డీఎస్ఏ నిర్దేశించిన పరీక్షల రిపోర్టులను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని వెల్లడించారు.