Nagam Janardhan Reddy | హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ కోసం తీవ్రంగా కష్టపడ్డా.. టికెట్ ఇవ్వకుండా తీవ్ర అవమానానికి గురి చేశారని ఆ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. తనను సంప్రదించకుండానే, అదీ పార్టీ మారి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వటం బాధ కలిగించిందని తెలిపారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన రాజీనామా లేఖ రాశారు.
ఆ లేఖలోని సారాంశం ఆయన మాటల్లోనే.. ‘కాంగ్రెస్ ఎదుగుదలకు శక్తివంచన లేకుండా కృషి చేశా. కమిటీల ఏర్పాటును విజయవంతంగా నిర్వహించా. ఏఐసీసీ, టీపీసీసీ కార్యక్రమాలన్నింటినీ నిజాయతీగా నిర్వహించా. వరంగల్ రైతు డిక్లరేషన్ , హైదరాబాద్ యువజన డిక్లరేషన్‌కు, తుకుగూడ విజయభేరికి మద్దతుదారులతో హాజరై, కార్యక్రమాల విజయవంతంలో భాగస్వామిని అయ్యా.
దళిత, గిరిజనులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా 50 వేల మందితో ‘దళిత్ గిరిజన ఆత్మగౌరవ సభ’ నిర్వహించా. 30 ఏండ్లలో నాగర్‌కర్నూల్‌లో పార్టీని విజయపథంలో నడిపించేలా కృషి చేశా. ఎలాంటి కారణం లేకుండా నాకు టికెట్ నిరాకరించటం ఆశ్యర్యానికి గురి చేసింది.
టికెట్ కేటాయించే ముందు ఎవరూ నన్ను సంప్రదించలేదు. ఇది నాకు చాలా బాధ కలిగించింది. అవమానానికి గురి చేసింది. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం దురదృష్టకరం. దశాబ్దాలుగా నేను విలువలతో కూడిన రాజకీయాల కోసం నిలబడ్డాను. అందుకనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేకపోతున్నాను. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవంతో, స్వేచ్ఛగా, న్యాయంగా సేవ చేయడానికే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని పేర్కొన్నారు.