హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్‌శాఖలో కాబోయే ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఈఎన్సీ జోగారెడ్డి పదవీ కాలం అక్టోబర్ 31తో ముగిసింది. కానీ శుక్రవారం కార్యాలయంలో ఉద్యోగ విరమణ వేడుకకు సంబంధించి.. ఎలాంటి హడావుడి కనిపించలేదు. పదవీకాలం పొడిగించుకొనేందుకు జోగారెడ్డి సీఎం స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. 2025 మార్చి 31న ఉద్యోగ విరమణ పొందిన మాజీ ఈఎన్సీ కనకరత్నం కూడా తన పదవి పొడిగింపు ఉత్తర్వులను పాత తేదీతో తెచ్చుకున్నారని సమాచారం. ఈఎన్సీ పదవీకాలం పొడిగించవద్దని, రిటైర్ అయిన అందరినీ పొడిగించుకుంటూ పోతే తమకు ప్రమోషన్లు మరింత ఆలస్యం అవుతాయని సీనియర్ చీఫ్ ఇంజినీర్లు వాపోతున్నారు.
ఆరు నెలల్లో ముగ్గురు రిటైర్
పంచాయతీరాజ్‌లో ఆరు నెలల్లో ముగ్గురు ఈఎన్సీలు మారారు. ఉద్యోగ విమరణ తర్వాత ఎక్స్‌టెన్షన్‌పై కొనసాగిన కనకరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దాంతో ప్రభుత్వం ఆయనను ఈఎన్సీ పదవీ నుంచి తొలగించింది. తదుపరి ఈఎన్సీగా బాధ్యతలు చేపట్టిన అశోక్.. రెండు నెలలు మాత్రమే పదవిలో కొనసాగి, ఉద్యోగ విమరణ పొందారు. రెండు నెలల క్రితం ఈఎన్సీగా వచ్చిన జోగారెడ్డి పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ఉద్యోగ విరమణ చేసిన అధికారుల పదవీ కాలాన్ని పొడిగించబోమని, ఎక్స్టెన్షన్లో కొనసాగుతున్న వారిని కూడా తొలగిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో జోగారెడ్డి రిటైర్ అయితే సీనియరిటీ ప్రకారం ప్రస్తుతం చీఫ్ ఇంజినీర్లుగా ఉన్న రామకృష్ణ, ప్రకాశ్, రామ్మోహన్, సమత ఈఎన్సీ రేసులో ఉన్నట్టు తెలిసింది. సమత నూతన ఈఎన్సీగా వస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.