రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10,954 జీపీవో పోస్టులను నేరుగా భర్తీ చేయాలని రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయం ఎదుట శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు జంగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
జీపీవో పోస్టులను పాత వీఆర్వో, వీఆర్ఏలతో భర్తీ చేయడంతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. 129 జీవో ప్రకారం ఆప్షన్లు ఇచ్చిన 6,120 పైచిలుకు పాత వీఆర్వో, వీఆర్ఏలకు పరీక్షలు నిర్వహించి విధుల్లోకి తీసుకోవాలని, మిగిలిన ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -ఉస్మానియా యూనివర్సిటీ