దేశానికి తెలంగాణ మాడల్ అవసరమని, ఇది గ్రామీణాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ కుమార్ సుథార్ అభిప్రాయపడ్డారు. పంట ఉత్పత్తుల ఎగుమతులపై, వ్యవసాయ అభివృద్ధిపై కేంద్రప్రభుత్వానికి ఓ ప్రణాళికంటూ లేదని విమర్శించారు. ఈ మేరకు దేశ వ్యవసాయ విధానంలో రావాల్సిన మార్పులు, రాష్ర్టాల్లో అమలవుతున్న పథకాలు, గ్రామీణాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఢిల్లీలో టీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుథార్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగానికి మార్గదర్శకంగా నిలిచేలా, అభివృద్ధి దిశగా నడిపించేలా దేశంలో కొత్త ఆహార విధా నం రావాల్సిన అవసరం ఉన్నది. దేశంలో పలు ఆహార పంటల ఉత్పత్తి పెరుగుతుండడంతో వాటిని ఎగుమతి చేసి ఇక్కడి రైతుల నుంచి మొత్తం పంటలను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. ఇది గొప్ప ఆలోచన. తద్వారా ఇక్కడి రైతులకు భరోసా పెరుగుతుంది. తాము ఏ పంట ఎంత పండించినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందనే నమ్మకం రైతుకు ఏర్పడుతుంది. దీనిపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది. దేశ వ్యవసాయరంగం అభివృద్ధి సాధించాలంటే నూతన సంస్కరణలను, రైతులకు మేలుచేసే విధానాలను అమలు చేయాలి. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్వాగతించదగినవి. తెలంగాణ వ్యవసాయ మోడల్ అచరణీయమైనది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూ డా దాన్ని అనుసరించాల్సిన అవసరమున్నది.
దేశంలోని ఇతర రాష్ర్టాల రైతులతో పోల్చితే తెలంగాణ రైతులు అదృష్టవంతులు. అక్కడి రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది రైతుబంధు పథకం. అది ఆ రాష్ట్ర రైతాంగానికి ఎంతో మేలు చేసింది. రైతుబంధు పథకాన్ని చూసే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ను అమలు చేస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు.. సమస్యల మూలాల్లోకి వెళ్లి వాస్తవాల ప్రాతిపదికన రూపొందించినవి. వాటిని దేశమంతటా అమలు చేయాల్సిన అవసరమున్నది. అప్పడే దేశ రైతాంగానికి భరోసా లభిస్తుంది.
ప్రస్తుతం గ్రామీణ భారతం ముఖచిత్రం వేగంగా మారుతున్నది. 1980, 90ల మాదిరిగా సాంప్రదాయిక గ్రామాలు ఇప్పుడు లేవు. గాంధీ, నెహ్రూల కాలంలో వ్యవసాయంతో ముడిపడిన గ్రామీణ జీవనం ఉండేది. అలాంటిది ఇప్పుడు గ్రామాలను, వ్యవసాయాన్ని వేర్వేరుగా చూసే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రైతులు, యువతలో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుత గ్రామీణ భారతం ఎన్నో ఆశయాలు, ఆకాంక్షలున్న యువతతో కూడుకొన్నది. రైతులు ఇప్పుడు ఆధునికత వైపు మొగ్గు చూపుతున్నారు. విభిన్న భౌగోళిక పరిస్థితులు, వాతావరణం కలిగివున్న దేశం మనది. స్థానిక పరిస్థితులు, అవసరాలను బట్టి ప్రత్యామ్నాయ పంట విధానాలను ఇక్కడ అమలు చేయాలి. ఆయా రాష్ర్టాల్లోని పరిస్థితులకు అనుగుణంగా వనరులను వినియోగించడంలో దేశ పాలకులు విఫలమవుతున్నారు. సహజవనరుల వినియోగానికి సరైన అభివృద్ధి ప్రణాళికలను ప్రభుత్వాలు చేపట్టడం లేదు. సహజవనరుల లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను అమలు చేయకపోవడం ప్రధాన వైఫల్యం. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాల పనితీరు, ఫలితాలు లేనప్పుడు నిరాశకు గురైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాజకీయ భరోసా లభిస్తే రైతుల ఆత్మహత్యలు ఆగిపోయే అవకాశం ఉంటుంది.
దేశంలో ఉత్పత్తి అయ్యే పంటలకు సంబంధించి ఎగుమతులు, మార్కెటింగ్‌పై స్పష్టమైన ప్రణాళిక ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది. కానీ ప్రస్తుతం కేంద్రప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికా లేదు. మద్దతు ధర ఇచ్చి చేతులు దులుపుకొంటున్నది. ఎమ్మెస్పీ అంటే మినిమమ్ సపోర్ట్ ప్రైస్‌గా కాకుండా మినిమమ్ సపోర్ట్ ప్యాకేజీగా చూడాలి. రైతులకు అండగా నిలిచేలా ఎమ్మెస్పీ ఉండాలి. తెలంగాణ వంటి రాష్ర్టాల్లో అధికంగా పంట ఉత్పత్తులు వచ్చినప్పుడు ఎగుమతి చేసే ప్రణాళిక కేంద్రం వద్ద ఉండాలి. అప్పుడే రైతుల నుంచి ప్రభుత్వాలు కొనుగోలు చేయగలుగుతాయి. లేదంటే రైతులు ఆగం కావాల్సి వస్తుంది. రైతులను ఇలా వదిలేయడం గ్రామీణ భారత అభివృద్ధికి ప్రధాన ఆటంకం అవుతుంది.
గ్రామీణాభివృద్ధి కోసం ప్రభుత్వాలు తమ బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలి. అయితే ప్రస్తుతం గ్రామాల్లో అత్యధికంగా ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్న నిధులు ఉపాధిహామీకి సంబంధించినవే. ఈ పథకం ఉద్దేశం ఎంతో గొప్పది. కానీ మెజార్టీ రాష్ర్టాలు ఈ పథకాన్ని సరిగ్గా వినియోగించుకోవడం లేదు. తెలంగాణాలో మాత్రం సీఎం కేసీఆర్ ఉపాధి హామీ నిధులను పక్కాగా వినియోగించుకొని రైతులకు ఎంతో మేలు చేశారు. వ్యవసాయరంగానికి అనుసంధానంగా ఈ నిధులను వినియోగించడం మంచి ఆలోచన.