హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూ ప్రొఫెసర్ డీన్ కుమార్ నియమితులయ్యారు. జేఎన్టీయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం హెచ్వోడీగా ఉన్న ఆయనను ఎంసెట్-23 కన్వీనర్‌గా నియమించారు. మరో ఆరు ప్రవేశ పరీక్షల కన్వీనర్లను కూడా ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శనివారం ప్రకటించారు. పీజీఈసెట్ కన్వీనర్‌గా జేఎన్టీయూ ప్రొఫెసర్ రవీందర్‌రెడ్డి, ఐసెట్ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ వరలక్ష్మి, ఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, లాసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి, ఎడ్‌సెట్ కన్వీనర్‌గా మహ్మాత్మాగాంధీ వర్సిటీ ప్రొఫెసర్ ఏ రామకృష్ణ, పీఈసెట్ కన్వీనర్‌గా శాతవాహన వర్సిటీ ప్రొఫెసర్ రాజేశ్‌కుమార్‌ను నియమించారు. ఈ ఏడాది గతానికి భిన్నంగా పాత వాళ్ల స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించగా, పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఒక వర్సిటీ నుంచి మరో వర్సిటీకి మార్చారు. ఇప్పటికే జాతీయ ప్రవేశ పరీక్షలను ప్రకటించగా, ఆయా తేదీలను బట్టి మన ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను రిలీజ్ చేయనున్నారు.
అంతా కొత్తవాళ్లే..
ప్రవేశ పరీక్షల కన్వీనర్ల ఎంపికలో ఉన్నత విద్యామండలి అధికారులు జాగ్రత్తలు పాటించారు. ఎడ్‌సెట్ మినహా ప్రవేశ పరీక్షలన్నింటికీ కొత్తవారినే నియమించారు. కీలకమైన ఎంసెట్ కన్వీనర్ బాధ్యతలను జేఎన్టీయూ ప్రొఫెసర్ డీన్ కుమార్‌కు అప్పగించారు. కొన్నింటి నిర్వహణ బాధ్యతలను మార్చారు. ఎంసెట్‌ను జేఎన్టీయూకు, ఐసెట్‌ను కేయూకు, లాసెట్‌ను ఓయూకు గతంలోలాగే అప్పగించగా, ఎడ్‌సెట్‌ను ఉస్మానియా నుంచి మహాత్మాగాంధీ యూనివర్సిటీకి మార్చారు. పీజీఈసెట్‌ను ఇది వరకు ఓయూ నిర్వహించగా, ఈ ఏడాది జేఎన్టీయూకు మార్చారు. ఈసెట్‌ను గతంలో జేఎన్టీయూ నిర్వహించగా, తాజాగా ఓయూకు, పీఈసెట్‌ను మహాత్మాగాంధీ వర్సిటీ నుంచి కొత్తగా శాతవాహన వర్సిటీకి అప్పగించారు.
సంక్రాంతి తర్వాత షెడ్యూల్స్
సంక్రాంతి తర్వాత ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి వెల్లడించారు. ఒక్క పీఈసెట్ మినహా మిగతా ప్రవేశ పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించాల్సి ఉండటంతో టీసీఎస్ అయాన్ సంస్థ అధికారులతో సంప్రదించి తుది షెడ్యూళ్లను ఖరారు చేస్తామని తెలిపారు.
ఇద్దరు మహిళలు..
ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఈ ఏడాది ఇద్దరు మహిళా ప్రొఫెసర్లకు అప్పగించారు. గతంలో ఎడ్‌సెట్ కన్వీనర్‌గా మృణాళిని ఉండగా, నిరుడు కన్వీనర్లలో మహిళలకు చోటు కల్పించలేదు. కానీ, ఈ ఏడాది రెండు పరీక్షల నిర్వహణ బాధ్యతలను మహిళా ఆచార్యులకే అప్పగించడం విశేషం.