హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ స్పెషల్ కమిషనర్‌గా, ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జితేందర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్‌ను రిలీవ్ చేసిన ప్రభుత్వం.. ఆయన స్థానంలో ఆదిలాబాద్ జడ్పీ సీఈవోగా పనిచేస్తున్న జితేందర్‌రెడ్డిని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తంగా ఎనిమిది మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. పశుసంవర్ధకశాఖ స్పెషల్ సీఎస్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న సబ్యసాచి ఘోష్‌ను ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, సంక్షేమ పథకాల అమలు విభాగానికి బదిలీ అయ్యారు. మహిళా శిశుసంక్షేమశాఖ సెక్రటరీ అనితారామచంద్రన్‌కు గిరిజన సంక్షేమశాఖ సెక్రటరీగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
బీసీ సంక్షేమశాఖ సెక్రటరీ ఈ శ్రీధర్‌కు జనరల్ అడ్మిషన్ సెక్రటరీగా అదనపు బాధ్యతలను అప్పగించారు. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఇలంబర్తిని రవాణాశాఖ కమిషనర్‌గా, పశుసంవర్ధకశాఖ సెక్రటరీగా నియమించారు. హార్టికల్చర్, సెరికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న యాస్మిన్ బాషాకు ఆయిల్‌ఫెడ్ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులుకు సాంఘిక సంక్షేమ పథకాల అమలు విభాగం ప్రత్యేకకార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.