హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు జాతీయస్థాయిలో నిర్వహించే జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ రెండు, మూడు రోజుల్లో విడుదలకానున్నది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఈ నెల 15న విడుదలయ్యే అవకాశం ఉన్నది. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి నాలుగో వారంలో మొదటి సెషన్, ఏప్రిల్‌లో రెండో సెషన్ పరీక్షలుండే అవకాశమున్నది. జేఈఈ అపెక్స్ బోర్డు చైర్‌పర్సన్‌గా ఈ సారి బనారస్ హిందూ యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్కే జైన్ నియమితులయ్యారు. జేఈఈ మెయిన్ దరఖాస్తు విధానం 3 దశల్లో ఉంటుంది. మొదట రిజిస్ట్రేషన్, ఆ తర్వాత దరఖాస్తు పూరించి చివరగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.