హైదరాబాద్: దేశంలోని ఐఐటీల్లో (IIT) ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ (JEE Advanced) పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. రెండు సెషన్లలో ఈ ప్రవేశ పరీక్షను (Entrance exam) నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే ర్యాంకింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రంలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 1.9 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది ఉంటారని అంచనా. ఈ ఏడాది ఈ పరీక్షను ఐఐటీ గువాహటి (IIT Guwahati) నిర్వహిస్తున్నది.
ఈ నెల 18న ఫలితాలు ప్రకటిస్తారు. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్ కోర్సులకు సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు. గత విద్యా సంవత్సరం అన్ని ఐఐటీల్లో 16,598 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈ సారి మరో 200 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తున్నారు. సుమారు 42 వేల మందిని జోసా కౌన్సెలింగుకు అనుమతిస్తారు.