హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీతో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదని, ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ స్పష్టంచేశారు. మ్యాగీ 8 రోజులు మాత్రమే ఇక్కడ ఉన్నారని చెప్పారు. ఆమె ఆరోపణల నేపథ్యంలో మిస్ వరల్డ్ నిర్వాహకులతోపాటు పోటీదారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. తాను కూడా కొన్ని ఈవెంట్లలో పాల్గొన్నానని, ఆమె ఆరోపించినట్టుగా అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపించలేదని స్పష్టం చేశారు. తమకు ఎక్కడా ఇబ్బంది ఎదురుకాలేదని పోటీదారులందరూ చెప్పారని తెలిపారు. చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన విందులో మిస్ ఇంగ్లండ్తోపాటు మిస్ వేల్స్ కూడా అదే టేబుల్ వద్ద ఉన్నారని పేర్కొన్నారు.
ప్రతీ టేబుల్ వద్ద పురుషులు, మహిళలు ఉన్నారని చెప్పారు. అక్కడ తమతో ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదని మిస్ వేల్స్ చెప్పారని వివరించారు. సెల్ఫీల కోసం ఎక్కువ మంది ప్రయత్నించడం మాత్రమే కొంత ఇబ్బందిగా ఉన్నదని కంటెస్టెంట్లు చెప్పారని తెలిపారు. మ్యాగీ ఆరోపణలపై మిస్ వరల్డ్ నిర్వాహకులు యూకేలో విచారణ జరుపుతున్నట్టు చెప్పారు.
ఆమె ఆరోపించినట్టుగా ఏమీ జరగలేదని, ఆ వార్త ప్రచురించిన మ్యాగజైన్‌కు అంత క్రెడిబిలిటీ కూడా లేదని చెప్పారు. ఆ టాబ్లాయిడ్లో వచ్చే కొన్ని రకాల ఫొటోల కోసమే కొందరు దానిని కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. మ్యాగీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. 31న జరగనున్న ఫైనల్‌పైనే దృష్టి పెట్టామని జయేశ్ వివరించారు.