Bal Bhavan | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : జవహర్ బాలభవన్..! అనేక మంది ప్రముఖులను తీర్చిదిద్దిన శిక్షణాకేంద్రం. వేసవి వికాసానికి కేరాఫ్ అడ్రస్. సంగీతాల సవ్వడులు.. మువ్వల చప్పుళ్లు.. పిల్లల మధురగాత్రాలు.. ఇక్కడ వినిపించేవి. ప్రముఖ విద్వాంసులు ఓనమాలు నేర్పించేవారు.. శిక్షణనిచ్చేవారు.. సాంస్కృతిక పోటీలు జరిగేవి. ఇదంతా గతం. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బాలభవన్‌లు నిర్వీర్యమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, శిక్షణనిచ్చేవారు లేకపోవడం, మొక్కుబడి పాఠాలతో గత వైభవ ప్రభను కోల్పోతున్నాయి. వేసవి శిక్షణా శిబిరాలు, చిన్నారుల ఆటపాటలతో కలకలలాడాల్సిన ఈ సంస్థ.. లయ తప్పింది. నిధులు, సిబ్బంది, పర్యవేక్షణ లేక కునారిల్లుతున్నది.
రాష్ట్రంలో 10 జవహర్ బాలభవన్‌లు, 12 బాలకేంద్రాలు ఉన్నాయి. ఒక్కో భవన్లో ఎనిమిది మంది చొప్పున టీచర్లు, సిబ్బంది ఉండాలి. కానీ, టీచర్లు లేకపోవడంతో డిప్యూటేషన్ల రాజ్యం నడుస్తున్నది. మ్యూజిక్, డ్రాయింగ్, టైలరింగ్ శిక్షకులను నియమించాల్సిన చోట గణితం, సైన్స్, తెలుగు, హిందీ టీచర్లను డిప్యూటేషన్‌పై నియమిస్తున్నారు. కొన్నిచోట్ల కూచిపూడి, భరతనాట్యం శిక్షణ అటకెక్కింది. సర్కారు బడుల్లో పాఠాలు చెప్పాల్సిన టీచర్లను డిప్యూటేషన్‌పై తీసుకొచ్చి బాలభవన్లోని గ్రంథాలయాల్లో విధులు కేటాయించారు. ఇలా నలుగురు టీచర్లను నియమించినట్టు ఆరోపణలున్నాయి. పాఠశాలల్లో పాఠాలు చెప్పాల్సిన వారికి గ్రంథాలయాల్లో ఏం పని అన్న ప్రశ్నలొస్తున్నాయి. హనుమకొండ జిల్లాకు చెందిన ఒక టీచర్‌కు రెండేండ్ల సర్వీస్ ఉంటే, ఐదేండ్లు డిప్యూటేషన్‌పై నియమించడం గమనార్హం.
బాలభవన్‌లు పాఠశాల విద్యాశాఖ పరిధిలో నడుస్తున్నాయి. చాలాకాలంగా వీటికి రెగ్యులర్ డైరెక్టర్లు లేరు. ఇన్చార్జి డైరెక్టర్లతో నెట్టుకొస్తున్నారు. పర్యవేక్షణ లోపం, ఇన్చార్జిలు పట్టించుకోవడంతో అనేక వివాదాలు వెలుగుచూస్తున్నాయి. టీచర్ల మధ్య అంతర్గత కలహాలు సంస్థకు అప్రతిష్ఠను తెచ్చిపెడుతున్నాయి. బాల భవన్ ఆధ్వర్యంలో ఏటా స్టేట్ థియేటర్ ఫెస్టివల్‌ను నిర్వహించేవారు. బాలసూర్య, బాలరత్న పోటీలను నిర్వహించి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేసేవారు. ఇప్పుడు అదంతా గతం! హైదరాబాద్ జంట నగరాల్లోని చిన్నారులకు ఇంటర్స్కూల్స్ పోటీలు నిర్వహించే వారు, వేసవి వస్తున్నదంటే సమ్మర్ క్యాంపులతో బాలభవన్‌లు, బాలకేంద్రాలు కళకలాడేవి. గతంలో ఏటా మూడు వేల మంది విద్యార్థులు చేరేవారు. కానీ, ఇప్పుడు మూడు వందల మందిలోపే పేర్లను నమోదు చేసుకుంటున్నారు. చాలామంది శిక్షణ మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు.
టీచర్ల కొరత ఉన్నది
బాలభవన్‌లో టీచర్ల కొరత ఉన్నది. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతోపాటు జిల్లాల్లోనూ ఒకరిద్దరు టీచర్లే ఉన్నారు. ఉన్నవారితోనే నడిపిస్తున్నాం. మరికొందరు డిప్యూటేషన్‌పై వచ్చి పనిచేస్తున్నారు. ఈ నెల 25న సమ్మర్ క్యాంపు నిర్వహించాలని నిర్ణయించాం. పలు అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.