హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : జమియత్ ఉలేమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మౌలా నా హఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ (78) అనారోగ్యం కారణంగా ఆదివారం కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, ఆరుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీగా పనిచేసిన షబ్బీర్ ముస్లింలు ఎదిగేందుకు కృషి చేశారు. సంతోష్‌నగర్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
మౌలానా హాఫీజ్ పీర్ షబ్బీర్ అహ్మద్ మృతిపై కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు. ఆయన మరణవార్త విని ఎంతగానో బాధపడ్డానని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన సుప్రసిద్ధ అలీమ్-ఎ-దీన్ (మతగురువు), నిస్వార్థ నాయకుడని, ఆయన సేవలు గుర్తుంచుకోదగినవని ప్రస్తుతించారు. ఆయన జీవితాన్ని మిల్లీ(జాతి), విద్యారంగం, సామాజిక సేవలకు ధారపోశారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమియత్ ఉలేమాకు, కుటుంబానికి పార్టీపరంగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.