భూదాన్‌పోచంపల్లి, నవంబర్ 20: క్షౌర వృత్తిలోకి రిలయన్స్ పెట్టుబడిదారులు వస్తే వారి సంస్థలపై భౌతిక దాడులు చేస్తామని బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల రౌండ్‌టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణులకు బీసీ సబ్బండ వర్ణాల మద్దతు ఉంటుందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రైవేటీకరణతో చేతివృత్తులు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశసంపదను అంబానీ, అదానీ చేతిలో పెట్టి ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అన్ని పార్టీలతో కలిసి రిలయన్స్ సంస్థలు క్షౌర వృత్తిలోకి రాకుండా వారి లైసెన్సులు రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ మాట్లాడుతూ.. రిలయన్స్ సంస్థలు క్షౌర వృత్తిలోకి వస్తే లక్షలాది మంది వృత్తిదారులు రోడ్డున పడే ప్రమాదం ఉన్నదన్నారు.
సమావేశంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జెమిని మురళీకృష్ణ, బహుజన ప్రజాశక్తి అధ్యక్షుడు నల్ల లక్ష్మణ్ మాదిగ, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, పోచంపల్లి నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు చింతల ఓం ప్రకాశ్, ముదిరాజ్, యాదవ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.