హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)లో అత్యంత కీలక విభాగమైన మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ నూతన డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీ రాజాబాబు ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో డాక్టర్ జగన్నాథ్ నాయక్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. డాక్టర్ జగన్నాథ్ నాయక్‌కు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో 35 ఏండ్లకుపైగా అనుభవం ఉన్నది. రక్షణ, ఏరోస్పేస్ అప్లికేషన్ల కోసం స్వదేశీ సాంకేతికతతో అధునాతన ఏవియానిక్స్ రూపకల్పన చేయడంలో ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందారు.
సీహెచ్ఈఎస్ఎస్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్న సమయంలో దేశ మొదటి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) వ్యవస్థ రూపకల్పన, క్షేత్రస్థాయి పరీక్షలు, సాంకేతిక బదిలీ ప్రక్రియను ఆయనే స్వయంగా ముందుండి నడిపించారు. ఇది భారత భవిష్యత్ రక్షణ రంగంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ప్రసిద్ధ ఆకాశ్ క్షిపణులకు సంబంధించిన ఫైబర్ ఆప్టిక్ గైరో గైడెన్స్ సిస్టమ్, డ్రోన్ నిరోధక లేజర్ వ్యవస్థల ప్రధాన రూపశిల్పి ఆయనే. డాక్టర్ నాయక్ బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్, పీహెచ్డీ పట్టాపొందారు. 2009 నుంచి 2014 వరకు ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ మద్రాస్‌లో డిస్టింగిష్డ్ విజిటింగ్ ప్రొఫెసర్‌గా యువ ఇంజినీర్లకు మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ జర్నల్స్‌లో 125కు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించడమే కాకుండా, పలు పుస్తకాలను కూడా రచించారు.