హైదరాబాద్ సిటీబ్యూరో/అంబర్‌పేట, అక్టోబర్ 18: దక్షిణామ్నాయ శృంగేరిపీఠ ఉత్తరాధికారి విధుశేఖర భారతీస్వామి ధర్మ విజయ యాత్రలో భాగంగా 20న హైదరాబాద్‌కు విచ్చేస్తున్నట్టు నల్లకుంట శంకరమఠం ధర్మాధికారి సీ శ్రీనివాసమూర్తి, బ్రాంచి హెడ్ జీ రవి తెలిపారు. శనివారం శంకమఠంలో వారు మీడియాతో మాట్లాడారు. 21వ తేదీ నుంచి 28 వరకు శంకరమఠంలో స్వామి భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు.
ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వామి దర్శనం ఉంటుందని తెలిపారు. రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు చంద్రమౌళీశ్వర అభిషేకం ఉంటుందని పేర్కొన్నారు. 27వ తేదీ కార్తీక సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చంద్రమౌళీశ్వర అభిషేకం ఉంటుందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కాగా, ధర్మవిజయ యాత్రలో భాగంగా 16న శంషాబాద్‌కు చేరుకున్న స్వామీజీ 18న బాసరలో సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం వేములవాడ చేరుకుని రాత్రికి బసచేస్తారు. సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. 21వ తేదీ నుంచి నవంబర్ 4వ తేదీ వరకు పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం నేపాల్ రాజధాని కఠ్మాండు వెళ్తారు.