చిక్కడపల్లి, ఆగస్టు 3: ఎలాంటి ధర్నాలు, నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా ఆదివారం చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, అశోక్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు నిరుద్యోగులను అరెస్టు చేశారు. రవిరాథోడ్, విశాల్, నితీశ్, నవీన్, అమర్‌ను అక్రమంగా అరెస్టుచేసి చిక్కడపల్లి పోలీస్స్టేషేన్కు తరలించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకుడు రవిరాథోడ్ మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సంవత్సరం కావడంతో శనివారం గాంధీగనర్లో పిండ ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించగా, ప్రభుత్వం అక్కసుతో పోలీసులతో నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేయించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
2024 ఆగస్టు 2న ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్‌క్యాలెండర్ విడుదల చేసి నేటికీ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఫైర్ అయ్యారు. ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయకుండా 60 వేల ఉద్యోగాలు భార్తీ చేశామని ప్రతి మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. నోటిపికేషన్ విడుదల చేయకుండా ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికైనా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, లేకుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని బొందపెడుతామని హెచ్చరించారు.