పాలకవీడు, జనవరి 27: సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ దర్గా పంచాయతీ పరిధిలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ప్రధానమైన గంధోత్సవం (ఉర్సే షరీఫ్)ను శుక్రవారం సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. హైదరాబాద్ వక్ఫ్‌బోర్డు కార్యాలయం నుంచి తీసుకొచ్చిన గంధాన్ని గ్రామంలోని దర్గా వద్ద వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఉంచారు. అక్కడి నుంచి అత్యంత పవిత్రంగా అమర్చిన కలశాలలో ఉంచి పక్కీర్ల ఖవ్వాలీ, మేళతాళాలతో చందల్ ఖానా వరకు తీసుకొచ్చారు. దర్గా ముజావర్ సయ్యద్ జానీ ఇంటి నుంచి గుర్రాలపై తీసుకొచ్చిన గంధాన్ని.. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, వక్ఫ్‌బోర్డు అధికారులు, ముస్లిం మతపెద్దలు, ముజావర్ల సమక్షంలో చందల్ఖానాలో ఉంచిన గంధంలో కలిపి పూజలు నిర్వహించారు. అనంతరం గంధాన్ని జాన్‌పహాడ్ దర్గా ప్రధాన వీధుల్లో పోలీసు బందోబస్తుతో ఊరేగించారు. ఈ గంధాన్ని అందుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఎగబడ్డారు. గంధోత్సవంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.