హైదరాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ): రంజాన్ పర్వదినం సందర్భంగా నిరుపేద ముస్లింలకు ప్రభుత్వం తరఫున రంజాన్ తోఫా(బహుమతి) ఇచ్చే సంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈయేడు తుంగలో తొక్కింది. సచివాలయంలో మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన రంజాన్ ఏర్పాట్ల సమీక్షా సమావేశంలో రంజాన్ తోఫా గురించి ఊసేత్తలేదు. ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సహా ఇతర ప్రజాప్రతినిధులు కూడా రంజాన్ తోఫాపై మౌనం వహించారు. స్వర్రాష్టంలో నిరుపేదలు పండుగలు ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ వివిధ పండుగలకు ప్రభుత్వం తరఫున బహుమతులు ఇచ్చే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ.. రంజాన్, క్రిస్మస్లకు క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫాలను అందించారు. ఈసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సంప్రదాయాన్ని విస్మరించింది. రంజాన్ తోఫా వల్ల అనేకమంది నిరుపేద ముస్లింలు కనీసం పండుగ రోజైనా కొత్త దుస్తులు ధరించే వారని.. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని పాటించకపోవడం వల్ల ఆ అవకాశం లేకుండాపోతుందని ముస్లిం మత పెద్దలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తరుఫున రంజాన్ తోఫా అందించేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.