Minister KTR | న్యూఢిల్లీ, జూన్ 23 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హ్యాట్రిక్ సీఎం అవ్వడం ఖాయమని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ దక్షిణాదిలోనే నిరంతరాయంగా సుదీర్ఘకాలం సీఎంగా హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీకి వచ్చిన మంత్రి కేటీఆర్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ఇప్పటివరకూ దక్షిణ భారతదేశంలో ఏకబిగిన మూడుసార్లు సీఎం అయినవారు లేరని పేర్కొన్నారు. ఎంజీఆర్, జయలలిత, ఎన్టీఆర్ వరుసగా ముఖ్యమంత్రులు కాలేదని గుర్తుచేశారు. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెంగాణలో జరుగుతున్న అభివృద్ధే పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఏ రంగాన్ని విస్మరించలేదని, సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య అభివృద్ధే ఇందుకు తార్కాణమని పేర్కొన్నారు.
‘దేశంలోనే మూడు శాతంకంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణకే కేంద్రం సర్కారు 30 శాతం అవార్డులను ఎందుకు ఇస్తున్నది?.. పంచాయతీ అవార్డులు, మున్సిపాలిటీ అవార్డులు, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతికి ప్రశంసలు ఎందుకు లభిస్తున్నాయి.. అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా తెలంగాణ ఎలా నిలుస్తున్నది?.. ఇదంతా సీఎం కేసీఆర్ సుపరిపాలన వల్ల కాదా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో 7.7 శాతం గ్రీన్ కవర్ పెరిగిందని, ఇది సర్వే ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కలేనని పేర్కొన్నారు. 5 లక్షల 13 వేల ఎకరాల్లో కొత్తగా అడవులను పెంపొందించామని, పచ్చదనం పెరుగడం దేశంలోనే చరిత్ర అని వెల్లడించారు. ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలైన అమెజాన్, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణకు వచ్చాయని చెప్పారు. ‘ఒక్కసారి హైదరాబాద్‌కు వచ్చి చూడండి.. ఎలా ఉందో మీ గుండెపై చేయి వేసుకొని చెప్పండి’ అని కోరారు. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ ‘ఇది ఇండియానేనా?’ అని ఆశ్చర్యపోతున్నట్టు చెప్పారు.
ప్రతిపక్షాలను ఓడించేందుకు ప్రజలు సిద్ధం
రాష్ట్రంలో తమను ఓడించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతుంటే.. వాళ్లను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు రెడీగా ఉన్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘తమది కుటుంబ పాలన అని విమర్శించే కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెబితే చాలా దరిద్రంగా ఉంటుంది. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ను చేశారు. ఆయనొక లీడర్.. ఆయన సీఎం అయిపోతాడని ఆంధ్రజ్యోతి పత్రిక నమ్ముతున్నది. మేమేం చేస్తాం.. వాళ్లను ఎవ్వరూ బాగుచేయలేరు’ అని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణలను చందమామలోని మచ్చలా పెద్దగా చేసి చూపుతున్నవారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఎందుకు రాయరని ఆంధ్రజ్యోతిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పత్రిక నడుపుతున్నాం కదా అని ఏదిపడితే అది రాయడం సరికాదని, తాము రాసిందే భగవద్గీత అని అనుకోవడం తప్పని చెప్పారు. తమవాళ్లు అక్కడక్కడా చిన్న చిన్న తప్పులు చేస్తున్నారనేది కాదనడం లేదని, కానీ ఓవరాల్‌గా ఈరోజు తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి సాధించి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు.
ఏ సూచికలు తీసుకొన్నా పరిపాలనలో తమదే బెటర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాయని అన్నారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని షెకావత్ పార్లమెంట్లో ప్రకటించారని గుర్తుచేశారు. ఆయన తమ పార్టీ కాదని, కేంద్రంలోని బీజేపీ పార్టీ అని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై స్పందిస్తూ.. ఆయనొక పవర్ లేని మంత్రి.. నిస్సహాయ మంత్రి , గోవా టూర్లు.. పర్యాటకానికి పనికొస్తారు.. దేనికి పనికిరాడని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన అప్పులు ఎవరైనా లెక్క రాసుకుంటారా? అప్పు అనేది గ్రాంటా? అని ప్రశ్నించారు. మాట్లాడితే, లక్షా 8 వేల కోట్ల నేషనల్ హైవేలు అంటారని.. టోల్ కట్టకుంటే ఊరుకొంటారా? అని ప్రశ్నించారు. ఏండ్లపాటు పాలించిన కాంగ్రెస్.. కనీసం తాగు, సాగునీకూడా ఇవ్వని సన్యాసి పార్టీ అని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీలే దేశంలో దరిద్రానికి మూలకారణమని మండిపడ్డారు. దేశంలో బీజేపీ పార్టీ ఇన్స్టిట్యూషన్ అబ్యూజ్‌కు పాల్పడుతున్నదని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నెత్తిన పెట్టుకొనేందుకు సిద్ధంగా లేరని తెలిపారు.
అన్నిరంగాల్లోనూ ప్రగతి పరుగులు
సీఎం కేసీఆర్ విజన్‌తో తెలంగాణలో అన్ని రంగాల్లోనూ ప్రగతి పరుగులు పెడుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్ర సర్కారు మొండిచెయ్యి చూపినా తెలంగాణ సర్కారు జిల్లాకో మెడికల్, నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో విద్యా విప్లవం నెలకొన్నదని, వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యనందించడంతో నిరుపేద బిడ్డలు నీట్, జేఈఈలాంటి పరీక్షల్లో సత్తా చాటుతున్నారని, ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధిస్తున్నారని తెలిపారు. ఏ రంగం తీసుకొన్నా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని చెప్పారు. ‘పల్లెలు, పట్నాలను పట్టించుకున్నం..వ్యవసాయాన్ని పట్టించుకున్నం..ఐటీని పట్టించుకున్నం.. అభివృద్ధి చేస్తున్నాం..ఏ రంగాన్ని విస్మరించలేదు’ అని పేర్కొన్నారు. అలాంటప్పుడు ప్రజలు తమకు ఓటు ఎందుకు వెయ్యకూడదని ప్రశ్నించారు.