హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ ( Phone Tapping ) వ్యవహారంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేటీఆర్, హరీష్‌రావులను గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధించడాన్ని తప్పుబడితే తనకు సిట్ నోటీసులు ( SIT Notice ) అందించడంపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ( RS Praveen Kumar ) తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ భవన్ లో పత్రికా సమావేశంలో ఖండించిన 12 గంటల లోపే రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చి రెండు రోజుల్లో ఆధారాలతో సహా రిప్లై ఇవ్వకపోతే సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్దం కావాలని వార్నింగ్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు అని వెల్లడించారు.
పోలీసుల వార్నింగ్‌లకు బయపడేది లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ కూడా వ్యక్తిగత దూషణలు , చిల్లర భాషను వాడనని, అదేవిధంగా వాస్తవాలు దాచననని తెలిపారు. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం కూడా ఆపనని వెల్లడించారు.రేవంత్ రెడ్డి ట్యాపింగ్ జరగడం మామూలే అని ఢిల్లీలో చెప్పినట్లుగా కూడా వార్తలున్నాయి. అలాంటప్పుడు సిట్ దర్యాప్తు ఎందుకు? అని ప్రశ్నించారు.
సిట్ ఛీఫ్ సజ్జనార్‌పై ఆంధ్ర ప్రదేశ్ లో నమోదైన కేసుల మీద మరో సిట్ వేయాలి అని డిమాండ్ చేసినట్లుగా నోటీసులో ఉందని , ఇది వాస్తవ విరుద్ధమని అన్నారు. ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలో నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ నాయకుల ఫోన్లు తెలంగాణ ప్రభుత్వం, ఇంటలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని 2015 జూన్ నెలలో ఆంధ్రలో అనేక పోలీసు స్టేషన్లలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కేసులు నమోదయ్యాయని పత్రికల్లో చాలా వార్తలొచ్చాయి. ఆ సమయంలో ఆంధ్రలో కూడా ఒక సిట్ కూడా ఏర్పాటు అయ్యింది.
నాడు తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం లో అధికారిగా సీపీ సజ్జనార్ పనిచేశారు అన్న అవగాహన తనకుందని అన్నారు. ప్రస్తుత ట్యాపింగ్ వ్యవహారం పై వేసిన రెండో తెలంగాణ సిట్‌కు ఛీఫ్ గా ఉండడం నైతికంగా కరెక్టు కాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మరుగున పడిన విషయాలను ప్రజల ముందుకు తీసుకరావాల్సిన కనీస బాధ్యత తనపై ఉందన్నారు. ఈ విషయం మీకు నచ్చకపోతే వివరణ ఇవ్వాలని సూచించారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పలు కుంభకోణాల (బొగ్గు కుంభకోణం తో సహా) మీద సిట్ వేయాలని డిమాండ్ చేశానని వివరించారు. తాను సజ్జనార్‌తో సహా ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదని వెల్లడించారు. గత రెండేళ్లుగా కేటీఆర్, హరీష్ రావు, మరెందరో బీఆర్ఎస్ నాయకులపై రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనలో తీవ్రమైన వ్యక్తిత్వ హననానికి గురయ్యారని పేర్కొన్నారు. ఆ విషయంలో నిందితులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వం చేస్తున్న ట్యాపింగ్ పై చేసిన ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇంతవరకు రేవంత్ రెడ్డికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదని అన్నారు. కనీసం తనకు అక్నాలెడ్జ్మెంటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. కేవలం బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే నోటీసుల మీద నోటీసులు రావడం, మీడియా లీకులు, జర్నలిస్టుల, సోషల్ మీడియా ఆక్టివిస్టుల విచ్చలవిడి అరెస్టులు దేనికి సంకేతమని నిలదీశారు. నాలుగు గోడల మధ్య జరగాల్సిన దర్యాప్తుపై గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులు ప్రతిరోజూ లైవ్ కామెంటరీ ఇవ్వడం దేనికి సంకేతంమని ప్రశ్నించారు.