హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య శిరీష, అతని అనుచరుడు దుడ్డు ప్రభాకర్ అరెస్టుపై ఎన్ఐఏ అధికారులు స్పందించారు. ఈ నెలలో నిర్వహించనున్న మావోయిస్టు వారోత్సవాల్లో భారీ కుట్రకు పథకం రచించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు వారిని అరెస్టు చేసినట్టు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రకాశం జిల్లాలోని శిరీష నివాసంలో ఆమెను ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మావోయిస్టులకు వీ రు నిధులు సమకూర్చుతున్నారని, వారి నుంచి వీరికి నిధులు భారీగా అందుతున్నాయని ఆర్కే రాసిన డైరీ ఆధారంగా తెలిసిందని పేర్కొన్నారు. శిరీష, ప్రభాకర్ ఇప్పటికీ మావోయిస్టుల కోసమే పనిచేస్తున్నారని తెలిపారు. వీరిద్దరూ 2019 లో జరిగిన తిరియా ఎన్కౌంటర్లో పాల్గొన్నట్టు సమాచారం ఉందని పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం కొత్త రిక్రూట్మెంట్లు నిర్వహిస్తున్నట్టు తమ దృష్టి వచ్చిందని వెల్లడించారు. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.