హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ట్రిబ్యునల్ అవార్డులు చెల్లవంట. సీడబ్ల్యూసీ అధ్యయనాలూ, వాటి గణాంకాలూ తప్పేనంట. గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీల వాటా లేదంట. తాను చెప్పిం దే లెక్కంట. ఈ విధంగా ఏపీ రాష్ట్రం అడ్డగో లు వాదనలకు దిగుతున్నది. జలాల వాటాపై పేచీ పెడుతున్నది. తెలంగాణ ప్రాజెక్టులకు అ నుమతుల మంజూరుపై యథావిధిగా అక్కసు వెళ్లగక్కుతున్నది. సీతారామ ప్రాజెక్టుకు క్లియరెన్స్‌లు ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతున్నది. అయితే ఏపీ వాదనలన్నింటినీ కేంద్ర జలసంఘం మరోసారి ఖండించింది. శాస్త్రీయ అధ్యాయనాల అనంతరమే అనుమతులిచ్చామని తేటతెల్లం చేసింది. తెలంగాణ వాటా గోదావరిలో 968టీఎంసీలని కరాఖండిగా తేల్చిచెప్పింది. జీఆర్ఎంబీ చైర్మన్ పద్మ డోర్జీ విజ్ఞప్తి మేరకు సబ్బేసిన్ల వారీగా గోదావరిలో నీటిలభ్యత అంశంపై మంగళవారం ఇరురాష్ర్టాలతో సీడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసింది.
గోదావరిలో నీటి లభ్యతపై 2023లో తాము చేసిన అధ్యయనాన్ని సీడబ్ల్యూసీ హైడ్రాలజీ వింగ్ సీఈ సంజయ్‌కుమార్ గంగ్వార్ ఈ సందర్భంగా వివరించారు. గోదావరి నదిలో మొత్తం నీటిలభ్యత, అందులో ఏ రా్రష్ట్రం వాటా ఎంత? అనే అంశాలను కూలంకషంగా ఆధారసహితంగా వెల్లడించారు. అయితే సీడబ్ల్యూసీ లెక్కలన్నీ తప్పంటూ ఏపీ ఈ సందర్భంగా వాదనలకు దిగింది. ఇంద్రావతి (జీ10)లో 358.10 టీఎంసీలు, శబరి (జీ11)లో 158.18 టీఎంసీలు మొత్తంగా ఏపీకి 516 టీఎంసీల లభ్యతే ఉన్నదని సీడబ్ల్యూసీ వెల్లడించిన గణాంకాలు అర్థరహితమంటూ అడ్డగోలు వాదన చేసింది. అసలు తెలంగాణకు నీళ్లే లేవంటూ మొండి వాదనకు దిగింది. తెలంగాణకు 968 టీఎంసీలే లేవని, అయినప్పటికీ సీతారామ వంటి ప్రాజెక్టులకు స్టడీ చేయకుండానే క్లియరెన్సులు ఇచ్చారని, అలా ఎలా ఇస్తారంటూ అక్కసు వెళ్లగక్కింది. తెలంగాణ ఇచ్చిన డాటా తీసుకొని.. ఇష్టమొచ్చినట్టు అధ్యయనాలు చేసి అవే లెకలు చూపిస్తున్నారంటూ ఆరోపించింది. అయితే ఏపీ వాదనలన్నింటినీ సీడబ్ల్యూసీ కొట్టిపారేసింది. జీఆర్ఎంబీ విజ్ఞప్తి మేరకే శాస్త్రీయంగా, ప్రామాణిక సూత్రాల ఆధారంగానే స్టడీ చేశామని తెలిపింది.
మొత్తంగా గోదావరిలో 3,397 టీఎంసీల జలాల లభ్యత ఉండగా, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ/బచావత్) అవార్డు ప్రకారం ఉమ్మడి ఏపీకి 1,435 టీఎంసీలు, అదేవిధంగా పోలవరం (పట్టిసీమ) ద్వారా కృష్ణా బేసిన్‌కు ఏపీ మళ్లిస్తున్న 45 టీఎంసీలను సైతం కలిపితే 1480 టీఎంసీల వరకు నీళ్లుంటాయని మరోసారి స్పష్టం చేసింది. ఆ డైవర్షన్ జలాలతో సహా గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీల జలాలు హకుగానే వస్తాయని సీడబ్ల్యూసీ మరోసారి తేల్చిచెప్పింది. గోదావరి బేసిన్లో తెలంగాణకు అధిక మొత్తంలో ప్రాణహిత నది (జీ9 బేసిన్) నుంచే 313.82 టీఎంసీల లభ్యత (35శాతం) ఉన్నదని, ఆ తర్వాత జీ5 మధ్య గోదావరి నుంచి 152 టీఎంసీలు, లోయర్ గోదావరి (జీ10)లో 159.50 టీంఎసీలు, జీ4 బేసిన్‌లోని మంజీరా నుంచి 187.60 టీఎంసీలు, మానేరు (జీ6) నుంచి 45.90, పెన్‌గంగ (జీ7) నుంచి 39.12, వార్ధా (జీ8) నుంచి 20.88 టీఎంసీల జలాలు హకుగానే ఉన్నాయని తేల్చిచెప్పింది. బచావత్ అవార్డు మేరకే అన్ని ప్రాజెక్టులకు టెక్నికల్ క్లియరెన్సులు ఇచ్చారని సీడబ్ల్యూసీ పునరుద్ఘాటించింది. ఈ అధ్యయనంపై మరోసారి రెండు రాష్ట్రాలతో కలిపి సమావేశం నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ ఈ సందర్భంగా తెలిపింది. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ నుంచి ఇంటర్ స్టేట్, హైడ్రాలజీ విభాగం అధికారులు పాల్గొన్నారు.