సూర్యపేట : కేంద్రంలో ఉన్నది రైతు ప్రభుత్వమంటూ బీజేపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. శనివారం సూర్యపేటలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ హయాంలో వ్యవసాయానికి తెలంగాణాకు ఎక్కువ నిధులు కేటాయించామని కిషన్ రెడ్డి , ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
బీజేపీ నాయకుల మాటాలను తెలంగాణ ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని, వారిని చూసి నవ్వుకుంటున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ వ్యవసాయాన్ని కార్పొరేట్ల కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతాంగ వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టిన ఫలితంగా మోదీ రైతులకు క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు.
ఢిల్లీలో రైతులు మోదీ గో బ్యాక్ అంటుంటే తెలంగాణ సరిహద్దు గ్రామాలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాల కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.