హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): ఇంధన ధరల పెంపుతో రిటైల్ డీలర్లకు కలిగే ప్రయోజనం నామమాత్రమేనని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏండ్ల తరబడిగా రిటైల్ డీలర్లు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
గత మూడు వారాలుగా అనేక జిల్లాల్లో డీలర్లు సమర్పించిన ఇండెంట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ సరఫరా అందండం లేదని, సరఫరా వ్యవస్థ అస్థిరంగా కొనసాగుతున్నదని వెల్లడించారు. ధరల పెరుగుదలతో పాటు అదే స్థాయిలో రోజువారీ నిల్వలు కొనసాగించడానికి మరింత వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చుకోవాల్సి వస్తుందన్నారు. అది చిన్న, మధ్యతరహా రిటైల్ ఔట్లెట్లపై తీవ్రమైన ఆర్థిక భారంమోపుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.