Hyderabad | హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు హైదరాబాద్‌నే తమ గమ్యస్థానంగా భావిస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ బ్రిటన్, అమెరికాల్లో జరిపిన పర్యటనల సందర్భంగా పలు గ్లోబల్ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, విస్తరణ ప్రణాళికలతో ముందుకు రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. దాదాపు రూ.5800 కోట్లకు పైగా పెట్టుబడులను ప్రకటించగా.. మరికొన్ని సంస్థలు పెట్టుబడి వివరాలను వెల్లడించాల్సివుంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో తమ కార్యాలయాలు, క్యాంపస్‌లూ ఉండాలన్న కృతనిశ్చయంతో ఉన్న అనేక అంతర్జాతీయ కంపెనీలు మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపాయి.
రాష్ర్టానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సాగిన మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన ఆశించిన ఫలితాలను ఇచ్చింది. బ్రిటన్, అమెరికాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. పలు కంపెనీలు వెంటనే తమ పెట్టుబడి ప్రకటనలు వెల్లడించగా, మరికొన్ని కంపెనీలు మంత్రితో చర్చించి కంపెనీల ఏర్పాటుపై అవగాహనకు వచ్చాయి. ఈ కంపెనీలు రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడి ప్రకటనలు చేయనున్నాయి. కంపెనీల నాయకత్వ బృందాలతో వరుస సమావేశాలు నిర్వహించిన కేటీఆర్, ఆయా కంపెనీలను రాష్ర్టానికి రప్పించడంలో సఫలమయ్యారు.
వివిధ రంగాల గ్లోబల్ లీడింగ్ సంస్థల ప్రతినిధులతో 80కి పైగా బిజినెస్ సమావేశాలు, ఐదు రౌండ్‌టేబుల్ సమావేశాలు, అనేకమందితో వ్యక్తిగత భేటీలు నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడికి ఉన్న అవకాశాలను కేటీఆర్ వారికి వివరించారు. ప్రభుత్వం వారికి పూర్తి అండగా నిలుస్తుందని, ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని సహాయ సహకారాలు వెంటనే లభిస్తాయని భరోసా కల్పిస్తూ, రాష్ట్రంలో వారు పెట్టుబడులు పెట్టేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా రాష్ర్టానికి ఈసారి కూడా పెట్టుబడుల వరద పారింది. ప్రస్తుతం వచ్చిన పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలతో దాదాపు 42,000 ఉద్యోగాలు లభించే అవకాశమున్నది.
రాష్ట్రంలో కార్యకలాపాలకోసం ముందుకొచ్చిన సంస్థల వివరాలు..
దేశంలో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ, అనుకూల గమ్యస్థానం తెలంగాణ రాష్ట్రమే. ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, మొబిలిటీ, టెక్స్టైల్ రంగాల్లో రాష్ట్రంలో విస్తృత అవకాశాలున్నాయి. అత్యంత వేగంగా, పారదర్శకంగా పరిశ్రమలకు అనుమతులిచ్చే సింగిల్ విండో విధానం ఇప్పటికే ప్రశంసలు అందుకున్నది. రాష్ర్టానికి పెట్టుబడులతో ముందుకు రావాలని, ఆయా సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉన్నది.
– మంత్రి కేటీఆర్
తెలంగాణ విజయాలతో పెట్టుబడిదారుల్లో భరోసా
రాష్ట్రం ఏర్పాటైన అతికొద్ది సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలు పెట్టుబడిదారుల్లో భరోసా కల్పించేందుకు దోహదం చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేసి పచ్చని రాష్ట్రంగా మార్చిన తీరును, మిషన్ భగీరథ ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా ఇంటింటికీ రక్షిత తాగునీటిని అందించిన వైనాన్ని అమెరికాలోని ఇంజినీర్లు ప్రశంసలతో ముంచెత్తారు. పోరాడి సాధించుకున్న రాష్ర్టాన్ని, అంతే కసితో అభివృద్ధి చేసుకోవడాన్ని తెలుసుకునేందుకు అమెరికన్లు ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు.
గ్లోబల్ గ్రీన్‌సిటీ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలను సాధించడం కూడా పెట్టుబడిదారుల్లో తెలంగాణపై సానుకూల వైఖరికి కారణమవుతున్నది. ఇప్పటికే అమెరికా బయట రెండో అతిపెద్ద క్యాంపస్‌లను హైదరాబాద్‌లో నెలకొల్పిన సంస్థలు.. రాష్ట్రంలో జరుగుతున్న సమ్మిళిత అభివృద్ధితో విస్తరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నాయి. మరికొంత మంది పెట్టుబడిదారులను రాష్ర్టానికి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ సుదీర్ఘ కృషి, నిరంతర ప్రయత్నాలు, బ్రిటన్, అమెరికా పర్యటనల ఫలితంగా రాష్ట్రంలో పారిశ్రామికరంగానికి సరికొత్త ఊపు లభిస్తున్నది.
ప్రగతిశీల విధానాలు, విస్తరణకు అవకాశాలు
రాష్ట్రంలో అమలవుతున్న ప్రగతిశీల, స్నేహపూర్వక పారిశ్రామిక విధానాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల మన్ననలు పొందుతున్నాయి. రాష్ట్రంలో పకడ్బందీగా అమలవుతున్న శాంతిభద్రతలు, అనుకూల వాతావరణం, ప్రభుత్వ విధానాలతోపాటు వ్యాపారాభివృద్ధికి ఉన్న అవకాశాలతో పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. దీంతో భారత్‌లో పెట్టుబడి పెట్టాలని భావించే కంపెనీలకు తెలంగాణ గమ్యస్థానంగా మారింది.
యువతకు ఉద్యోగాల కల్పన, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ వంటి పథకాలు, ఆకర్షణీయ ప్రోత్సాహకాలు రాష్ర్టానికి పెట్టుబడుల వరద పారించేందుకు తోడ్పడుతున్నాయి. అన్నిటికిమించి మంత్రి కేటీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకుంటూ.. భారత్ వైపు చూస్తున్న కంపెనీలను తెలంగాణకు వచ్చేవిధంగా తనదైన శైలిలో కృషిచేస్తున్నారు. ప్రపంచంలో దిగ్గజ సంస్థలకు కేంద్రంగా ఉన్న అమెరికా, బ్రిటన్, తైవాన్, జపాన్ తదితర దేశాలకు చెందిన కంపెనీలను రాష్ర్టానికి రప్పించేలా చొరవ చూపుతున్నారు.
2023 సంవత్సరంలో దేశంలోనే అత్యధిక ఐటీ ఉద్యోగాలు కల్పించిన నగరం- హైదరాబాద్
(గమనిక- కంపెనీల ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణకు ముందుకొచ్చిన పలు కంపెనీలు తమ పెట్టుబడి వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అలాగే, మరికొన్ని కంపెనీలు ఉద్యోగావకాశాల వివరాలను వెల్లడించాల్సివుంది.)