హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): రైతులకు పంటల దిగుబడిని పెంచడంలో సాయిల్ కర్బనం కీలకపాత్ర పోషిస్తున్నది. సాగు విధానాలు, అధికంగా రసాయనిక ఎరువుల వినియోగంతో భూమిలో సాయిల్ కర్బనం పరిమితి తగ్గిపోతుండటంతో వ్యవసాయ రంగమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు వస్తున్నాయి. ఈ క్రమంలో మట్టికి మేలు చేసే కర్బనాన్ని పెంచేందుకు ఇక్రిశాట్ పరిశోధనలు చేస్తున్నది.
దేశంలోని పలు ప్రాంతాల్లో శీతోష్ణస్థితికి అనుగుణంగా మట్టి సారాన్ని పెంచేందుకు కృషిచేస్తున్నది. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో 2-8 శాతం మేర ఉండే సాయిల్ కర్బనం పరిమాణం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే దేశంలో 0.2-2.0 శాతం లోపు ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణులు తెలిపారు. ఈ క్రమంలో పంటకు అవసరమైన పోషకాలను వృద్ధి చేసే సాయిల్ కర్బనాన్ని పెంచేందుకు ఇక్రిశాట్ కృషిచేస్తున్నది.
పలు ప్రాంతాల్లో అధ్యయనం
ఉష్ణోగ్రతలు అధికంగా, వార్షిక వర్షపాతం 600 మి.మీ నుంచి 1100మి.మీటర్ల మేర ఉండే మహారాష్ట్రలోని జాల్నా, ధూలే, అహ్మద్‌నగర్, అమరావతి, యావత్మాల్, ఒడిశాలోని ఆంఘుల్, బోలాన్గిర్, దేవఘర్, డెన్కెనాల్, కలహండీ, కెండుజార్, నువాపాడ, సుండేఘర్ ప్రాంతాల్లో ఇక్రిశాట్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. తెలుగు రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూసారాన్ని పరిశీలించారు.
ఇందులో మెజార్టీ ప్రాంతాల్లో భూమిలో ప్రామాణికంగా ఉండాల్సిన సాయిల్ కర్బన శాతం భారీగా తగ్గిందని గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సేంద్రియ సాగు విధానాలతో సాయిల్ కర్బనం పరిమాణాన్ని పెంచేందుకు పంటల మార్పిడి, వాతావరణ అనుకూలతలు, భూసారం ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రయోగాలను చేస్తున్నారు. బొగ్గు, మొక్కల వ్యర్థాలతో తయారు చేసే బయోచార్ భూసారాన్ని పెంచుతుందని గుర్తించారు. సంప్రదాయ వ్యవసాయ విధానాలు కూడా భూమిలో కర్బన పరిమాణం పెరిగేందుకు సాయపడుతాయని తేల్చారు. ముఖ్యంగా బయోచార్ వినియోగం మట్టిలో 130-300 శాతం మేర పెరుగుతుందని నిర్ధారించారు.