హైదరాబాద్, ఆగస్టు22 (నమస్తే తెలంగాణ): హైపవర్ కమిటీ (హెచ్పీసీ) నిర్ణయం మేరకే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేశామని విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ పునరుద్ఘాటించారు. జస్టిస్ ఘోష్ కమిటీ ఎదుట గురువారం మరోసారి హాజరైన ఆయన పలు విషయాలను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ఇంజినీర్ల విచారణ గురువారమూ కొనసాగింది.
ప్రాజెక్టు రీడిజైన్‌పై ఇప్పటికే పలు ప్రశ్నలను సంధించిన కమిషన్ మరోసారి అందుకు సంబంధించిన అంశాలపైనే వివరాలను సేకరించింది. రీ డిజైన్ ఎలా? ఎప్పుడు, ఏ విధానం ద్వారా చేశారు? మారిన ప్రాజెక్టు ఆయకట్టు ఎంత? బరాజ్‌లకు టీఏసీ అనుమతులు ఎప్పుడు లభించాయి? తదితర అంశాలపై మురళీధర్‌ను కమిటీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా ప్రతి ప్రశ్నకూ సూటిగా, ఎలాంటి తడబాటు లేకుండానే రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ బదులిచ్చారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు, కాంతనపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టుల్లో సవాళ్ల పరిష్కారానికి గత ప్రభుత్వం 2014 జూలై 22న హైపవర్ కమిటీని నియమించిందని, ఆ మేరకు జీవో 10ని జారీ చేసిందని గుర్తుచేశారు. ఆ కమిటీ సూచనలతో సవాళ్ల పరిష్కారానికి రీ డిజైన్లు చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 11 డైరెక్టరేట్లు, టీఏసీ అనుమతులు వచ్చాయని తెలిపారు. మురళీధర్ చెప్పిన అంశాలన్నింటినీ కమిషన్ రాతపూర్వకంగా తీసుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్లను రూపకల్పన చేసిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) రిటైర్డ్ ఈఎన్సీ నరేందర్‌రెడ్డిని గురువారమే జస్టిస్ ఘోష్.. క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. డిజైన్లకు సంబంధించి నరేందర్‌రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లలోని అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రాజెక్టు రూపకల్పన, సర్వేలు, లోకేషన్ల ఎంపికలో సీడీవో పాత్ర ఏమీ లేదని నరేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యాప్కోస్ సర్వే, లోకేషన్ల ఎంపిక పూర్తయిన తర్వాత డిజైన్ల కోసం వచ్చారని వెల్లడించారు.
క్షేత్రస్థాయిలో సందర్శించి సైట్ కండీషన్లను పరిశీలించాక, హైడ్రాలజీ, జియో ఇన్వెస్టిగేషన్ నివేదికలు వచ్చాక, 2డీ స్టడీస్ తర్వాతే డిజైన్లను రూపొందించామని తెలిపారు. 3డీ స్టడీస్ రిపోర్టు అంశాలు, డిజైన్లు సరిపోలాయని తెలిపారు. ఫీల్డ్ ఇంజినీర్లు బాధ్యత వహిస్తామని ఒప్పుకున్న తర్వాతే డిజైన్ల చెక్‌లిస్ట్‌పై సంతకాలు చేశామని తెలిపారు. డిజైన్ల అంశాలపై ఎప్పటికప్పుడు ఎల్అండ్టీ ఏజెన్సీ ప్రతినిధులు సమ్మతించాకే ఆమోదించామని స్పష్టంచేశారు.
షూటింగ్ వెలాసిటీ అంచనాలకు అనుగుణంగా డిజైన్లను రూపొందించకపోవడం వల్లే బరాజ్‌లోని 2 పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయంటే తాను అంగీకరించబోనని నరేందర్‌రెడ్డి తేల్చిచెప్పారు. రాఫ్ట్ కింద ఒక చోట ఇసుక కొట్టుకుపోవడం వల్లే ఇది జరిగి ఉంటుందని తెలిపారు. అయితే రాఫ్ట్ మొత్తాన్ని పూర్తిగా ఓపెన్ చేసి పరీక్షించి నిర్ధారించాల్సి ఉంటుందని, ఇదే విషయమై డిజైన్లు రూపకల్పన చేసిన ఇంజినీర్‌గా సెక్రటరీకి, ఏజెన్సీకి లేఖలు కూడా రాశానని స్పష్టం చేశారు.