హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): రాంజీగోండ్ మ్యూజియం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, నవంబర్15 నాటికి అందుబాటులోకి వస్తుందని గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి, డైరెక్టర్ బీఎం సంతోష్ వెల్లడించారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలను డీఎస్ఎస్ భవన్‌లోని ట్రైబల్ మ్యూజియంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్రంభీం, సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజన మ్యూజియాలు గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, విలువలు భావితరాలకు పరిచయం చేసే వేదికలని తెలిపారు. మ్యూజియాలను ఇంటరాక్టివ్, డిజిటల్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కా ర్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడు సర్వేశ్వర్‌రెడ్డి, టీఆర్ఐ డైరెక్టర్ సముజ్వల, క్యురేటర్ సత్యనారాయణ పాల్గొన్నారు.