హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ప్రపంచస్థాయి రియో కార్నివాల్ తరహాలో తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని పర్యాటక శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీటీడీసీ) కార్యాలయంలో మంగళవారం కార్పొరేషన్ చైర్మన్ రమేశ్‌రెడ్డితో కలిసి ఆ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణలో పీపీపీ విధానంలో 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. జాతీయ రహదారుల్లో వే సైడ్ అమినిటీస్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యాటక శాఖ అధికారులు రిజల్ట్ ఓరియంటెడ్‌గా పనిచేయాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా అధికారులు చొరవ చూపాలని కోరారు.