నిజామాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శనివారం నిజామాబాద్ నగరంలో నిర్వహించిన శోభాయాత్ర బీజేపీ నేతల తన్నులాటకు వేదికైంది. కంఠేశ్వర్ దేవాలయం నుంచి పురవీధుల్లో విజయ యాత్ర పేరుతో పలు హిందూ సంస్థలు కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్ ముఖ్యఅతిథిగా వచ్చి శోభాయాత్రను ప్రారంభించాల్సి ఉండగా సమయపాలన పాటించలేదు. దీంతో వేలాది మంది భక్తులు ఉదయం నుంచి శోభాయాత్ర ప్రారంభోత్సవం కోసం వేచి చూస్తూ ఎండలో నిలబడి పోయారు. దీన్ని గమనించిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ రంగంలోకి దిగి ఎంపీ తీరు సరికాదంటూ వాదించారు. ఓ వ్యక్తి కోసం దేవుడిని రెండు గంటలపాటు రోడ్లపై నిలబెట్టడం పద్ధతి కాదంటూ పలువురు బీజేపీ నాయకులపై మండిపడ్డారు.
ఎంపీ వచ్చేదాకా ఆగాల్సిందేనంటూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గొడవకు దిగారు. దీంతో కోపోద్రిక్తులైన యెండల లక్ష్మీనారాయణ వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎవడో వస్తాడని దేవుళ్లని ఆపడం ఏంటంటూ ధన్పాల్ను మెడ పట్టి పక్కకు తోసేశారు. ఇతర నాయకులనూ అడ్డు తొలగించారు. శోభాయాత్ర కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కలిసి ముందుకు కదిలారు. అనంతరం కిలో మీటరు మేర కదిలిన శోభాయాత్రలో ఎంపీ అర్వింద్ ప్రత్యక్షమై వెళ్లిపోయారు. బీజేపీ ముఖ్య నాయకుల ఆధిపత్య పోరును గమనించిన ఇందూరు వాసులు ఆ పార్టీ తీరుపై మండిపడుతున్నారు.