షాద్‌నగర్, సెప్టెంబర్ 2 : అప్పటివరకు తోటి విద్యార్థులతో కలిసి ఉన్న ఓ విద్యార్థిని ఉన్నట్టుండి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాలలో బుధవారం చోటుచేసుకున్నది. ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్నఆదిరాల పంచాయతీలోని తండాకు చెందిన అశ్విని కమ్మదనం గురుకులంలో ఇంటర్ చదువుతున్నది.
మధ్యాహ్న సమయంలో ఉన్నట్టుండి కళాశాల నుంచి వసతిగృహంలోని గదికి వెళ్లి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలుపడంతో వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడినుంచి ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా మృతి చెందినట్టు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. తోటి విద్యార్థిని మృతి చెందడంతో కమ్మదనం గురుకులంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అశ్విని మృతికిగల కారణాలు తెలియరాలేదు.