కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 7 : మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. త్రీ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ప్రగతినగర్‌కు చెందిన కేశబోయిన మేఘన (17) లక్ష్మీదేవిపల్లి మండలంలోని కృష్ణవేణి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. తండ్రి శ్రీనివాసరావు ట్రాలీ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల కళాశాలలో జరిగిన వారాంతపు పరీక్షల్లో మేఘనకు మార్కులు తక్కువగా రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో క్షణికావేశానికి లోనై ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు మేఘనను వెంటనే దవాఖానకు తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. త్రీ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.