Inter Practicals | హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : మీరు ఇంటర్ ఫస్టియర్ ఇంగ్లిష్ చదువుతున్నారా! అయితే ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో భాగంగా మీకు ఇష్టమైన టీచర్, ఆట గురించి ఒక నిమిషం పాటు మాట్లాడాలి. వారి గురించి మీకు తెలిసిన విషయాలు, ప్రత్యేకతలపై 60 సెకండ్ల పాటు ప్రసంగించాలి. ఇలా చేస్తే మార్కులేస్తారు. ఇలాంటివి 30 అంశాలు ఇస్తారు. వీటిల్లో ఒకదానిని ఎంచుకొని మాట్లాడాలి. ఇంగ్లిష్ ప్రాక్టికల్స్‌లో మూల్యాంకన పద్ధతుల్లో జస్ట్ ఏ మినట్ (జామ్ )ఒకటి. ఈ జామ్‌లో భాగంగానే విద్యార్థులు నిమిషం పాటు ప్రసంగించాలి. ఇక రోల్ ప్లేలో భాగంగా ఇద్దరు విద్యార్థులు ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు పరస్పరం సంభాషించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ఒక దుకాణాదారుడు.. వినియోగదారుల మధ్య సంభాషణను రోల్ ప్లేలో చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేటివ్ స్కిల్స్‌లో భాగంగా విద్యార్థి మాటలను ఒకటి లేదా రెండు నిమిషాల పాటు రికార్డుచేస్తారు. దీనికి మార్కులుంటాయి. ఇంటర్ స్థాయిలోనే ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను మెరుగుపరిచేందుకు ఇంటర్‌బోర్డు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులకు 80 మార్కుల థియరీ, 20 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. థియరీలో 28 మార్కులు, ప్రాక్టికల్స్‌లో 7 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్టు లెక్కలోకి తీసుకొంటారు. టొఫెల్, ఐఈఎల్టీఎస్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షలకు పునాది వేసే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అధికారులు తెలిపారు. ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నేపథ్యంలో ఇంటర్‌బోర్డు రాష్ట్రంలోని 2,600 లెక్చరర్లకు శిక్షణ ఇచ్చింది.