హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తిషెడ్యూల్ను ఇంటర్‌బోర్డు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నది. కొంతకాలంగా ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచే ప్రారంభమవుతున్నాయి. ఈసారి సైతం బుధవారం నుంచే పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 2024లో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమయ్యాయి. ఈసారి మూడు రోజులు ముందుగానే ప్రారంభంకానున్నా యి. ఒక రోజు ఫస్టియర్, మరో రోజు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. జనవరిలో ఎథిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫిబ్రవరిలోనే సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు.
ఈ సారి ఇంటర్ పరీక్ష ఫీజును రూ.30 పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. హ్యుమానిటీస్(ఆర్ట్స్) కోర్సుల ఫీజు రూ. 520 ఉండగా, తాజా పెంపుతో రూ. 550 కానున్నది. సైన్స్ విద్యార్థుల ఫీజు రూ. 750 ఉండగా, ఇప్పుడు రూ. 780కి పెరగనున్నది. నిరుడు రూ. 20 పెంచగా, ఈ సారి రూ. 30 పెంచారు. ఒకేసారి భారీగా కాకుండా ఏడాదికి కొంత చొప్పున ఫీజులు వడ్డిస్తున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు ఈ వారంలోనే విడుదల చేయనున్నది. ఇక నామినల్రోల్స్లో తప్పులుండకుండా ఇంటర్‌బోర్డు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నది. ఈనెల 27 వరకు తప్పులుంటే సవరించుకునే అవకాశం ఇచ్చారు.