హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తును సీఎం కేసీఆర్ ఏవిధంగా ప్రభావితం చేశారో హైకోర్టు సింగిల్ జడ్జి తన తీర్పులో చెప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపట్టింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడంలో తప్పేమున్నదని ప్రశ్నించింది. రాజకీయ పార్టీ అధినేతగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం తప్పేమీ కాదని స్పష్టంచేసింది. ఎమ్మెల్యేలకు ఎర సీడీలు వివిధ మార్గాల్లో బయటకు వచ్చాయని విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడిస్తూనే, ఆ సీడీలను మీడియాకు అందజేశారని తెలిపింది. ఆ సీడీలను సీఎంకు ఎవరు అందించారో స్పష్టత లేదని సింగిల్ జడ్జి పేర్కొంటూ సిట్‌ను రద్దు చేయడం, ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడం చెల్లదని వాదించింది.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ టీ తుకారాంజీతో కూడిన ధర్మాసనం సోమవారం ఆన్లైన్లో విచారణ జరిపింది. తొలుత నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు ఉదయ్ హోల్లా, ఎస్డీ సంజయ్ వాదించారు. అనంతరం ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదిస్తూ.. ‘ఎమ్మెల్యేల కొనుగోలుకు అక్టోబర్ 26న మొయినాబాద్ ఫాంహౌస్‌లో నిందితులు ప్రయత్నించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. సంబంధిత సీడీలను అక్టోబర్ 27, 29 తేదీల్లో ఏసీబీ కోర్టు మేజిస్ట్రేట్‌కు సమర్పించారు. ఈ వ్యవహారంపై బీజేపీ రిట్ పిటిషన్ దాఖలుచేయడంతో పోలీసులు నవంబర్ 3 ఉదయం 11 గంటలకు ఆ సీడీలను హైకోర్టుకు నివేదించారు.
ఇవన్నీ పబ్లిక్ డాక్యుమెంట్లే. అవి ఏసీపీ ద్వారానే సీఎంకు చేరి ఉంటాయన్నది కేవలం భావన మాత్రమే. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసిన 12 గంటల్లోపే బీజేపీ హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. ఒక పార్టీ అధినేతగా సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సీడీలను మీడియాకు ఇవ్వడం సర్వసాధారణమే. ఇలా చేయడం రాజకీయాల్లో భాగమేనని సింగిల్ జడ్జి కూడా అంగీకరించారు. కానీ, దీన్నే ఒక కారణంగా చూపి నిందితుల హకుల రక్షణ పేరుతో సిట్‌ను రద్దు చేయడం, కేసును సీబీఐకి బదిలీ చేస్తూ తీర్పుఇవ్వడం అన్యాయం. సిట్ దర్యాప్తు ఏకపక్షంగా ఉన్నదని చెప్తే సరిపోదు. కారణాలను కూడా చూపాలి. కానీ, సింగిల్ జడ్జి ఏ కారణాన్నీ చూపలేదు. సిట్ దర్యాప్తు ఏకపక్షంగా ఉన్నదని జడ్జి ఏ దశలోనూ చెప్పలేదు. అసాధారణ కేసుల్లో దర్యాప్తు సంస్థను మార్పు చేయవచ్చని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తించదు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు వ్యూహాత్మకంగా వలపన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇలాంటి వ్యవహారాలపై దర్యాప్తు చేసే హకు రాష్ట్ర పోలీసులకే ఉంటుంది. అయినా ఈ కేసులో సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి బదలాయించడం పోలీసుల చట్టబద్ధమైన హకును లాకోవడమే అవుతుంది’ అని వివరించారు.
అసలు కేసే అవసరం లేదని చెప్పినట్టే..
ఎమ్మెల్యేలకు ఎర కేసును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీబీఐకి బదిలీ చేయడమంటే, మొత్తంగా అసలు కేసే అవసరం లేదని చెప్పినట్టేనని దుష్యంత్ దవే పేర్కొన్నారు. సీఎం నిర్వహించిన విలేకరుల సమావేశం ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నదని చెప్పేందుకు సింగిల్ జడ్జి కారణాలను పేర్కొనలేదని తెలిపారు. సీఎంకు సీడీలు ఎలా వచ్చాయన్నదానిపై స్పష్టత రానందునే ఈ కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేసినట్టు సింగిల్ జడ్జి చెప్పడాన్ని నిబంధనలకు విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్న దశలో జోక్యం చేసుకుని సీబీఐ దర్యాప్తు చేయాలని సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వడం చెల్లదన్నారు. అత్యంత అసాధారణ (రేర్ ఆఫ్ రేర్) పరిస్థితుల్లోనే దర్యాప్తు సంస్థను మార్చే అధికారం కోర్టుకు ఉంటుందని, ఎమ్మెల్యేలకు ఎర కేసులో అలాంటి అసాధారణ పరిస్థితులేవీ లేవని స్పష్టం చేశారు.
అప్పీల్ ఇకడే దాఖలు చేయొచ్చు
సిట్ దర్యాప్తును రద్దు చేయాలంటూ నిందితులు క్రిమినల్ పిటిషన్ వేయలేదని, వారు దా ఖలు చేసిన రిట్ పిటిషన్‌పై న్యాయమూర్తి రా జ్యాంగంలోని 226 అధికరణ కింద అసాధారణ అధికారాలతో తీర్పు వెలువరించారని దు ష్యంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ తీర్పుపై ఇదే హైకోర్టులోని ద్విసభ్య ధర్మాసనం ఎదుట అప్పీల్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని అన్నారు. క్రిమినల్ పిటిషన్‌పై సింగిల్ జడ్జి తీర్పు చెప్పినందున ఈ అంశంపై సుప్రీంకోర్టులోనే అప్పీల్ చేయాలని నిందితులు, బీజేపీ వాదించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించా రు. ఇదే హైకోర్టు కూడా ఆ తరహాను తీర్పు ఇచ్చిందని ఉదహరించారు. సిట్‌ను రద్దు చేసి ఈ కేసును సీబీఐకి లేదా హైకోర్టు నియమించే సిట్‌కు బదిలీ చేయాలని మాత్రమే నిందితులు పిటిషన్లో అభ్యర్థించారని, పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేయాలని కోరలేదని గుర్తుచేశారు.
నిందితుల పిటిషన్ క్రిమినల్ అంశానికి చెందినది కానందున ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద అప్పీల్ చేసుకోవడమే చట్టబద్ధమని వివరించారు. ఇదే విషయాన్ని గతంలో పలు హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టు కూడా తమ తీర్పుల్లో స్పష్టం చేశాయని పేర్కొన్నారు. దీనితోపాటు అనేక విషయాలను సింగిల్ జడ్జి విస్మరించి తీర్పు వెలువరించారని చెప్పారు. ఏ కేసులోనైనా నిందితులకు మాదిరిగానే ఫిర్యాదుదారుకూ హకులు ఉంటాయని, ఎమ్మెల్యేలకు ఎర కేసుపై రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలీసుల దర్యాప్తును శంకించడం సరికాదని దుష్యంత్ దవే పేర్కొంటూ.. సింగిల్ జడ్జి తీర్పును కొట్టేయాలని కోరారు. అనంతరం తదుపరి వాదనలు మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడ్డాయి.
చెప్పిందే.. చెప్పుడా?
నిందితుల లాయర్ తీరును ప్రశ్నించిన న్యాయమూర్తి ఎమ్మెల్యేల ఎర కేసును సింగిల్ జడ్జి సీబీఐకి బదిలీ చేయడాన్ని సమర్థిస్తూ నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది ఉదయ్ హుల్లా చేసిన వాదనలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితుల తరఫున ఇప్పటికే ఇతర న్యాయవాదులు డీవీ సీతారాంమూర్తి, ఎల్ రవిచందర్ వినిపించిన వాదనలనే మళ్లీమళ్లీ వినిపిస్తే ఎలాగని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూ యాన్ ప్రశ్నించారు. తమ ముందు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఇతర కేసులు చాలా ఉన్నాయని, వాటిని పక్కకు నెట్టి ఈ కేసును ఎంకెన్నాళ్లు కొనసాగించాలని ఉదయ్ హుల్లాను నిలదీశారు. దీంతో నిందితుల తరఫున ఆ ఇద్దరు న్యాయవాదులు గతంలో వాదించిన విషయం తనకు తెలియదంటూ ఉదయ్ హుల్లా క్షమాపణ చెప్పి వాదన ముగించారు. అనంతరం మరో నిందితుడు తుషార్ వెల్లపల్లి తరఫు న్యాయవాది ఎస్డీ సంజయ్ క్లుప్తంగా వాదన వినిపించారు.